Online Game Gambled: ఆన్‌లైన్ మోజులో రూ. 95 లక్షలు పోగొట్టుకున్న రైతు కొడుకు, తెలంగాణ ప్రభుత్వం పరిహారం కింద ఇచ్చిన నగదును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్న తెలంగాణ యువకుడు
ఇటీవల భూ యజమాని నుంచి శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. ఇంకా డబ్బు రాలేదు, రిజిస్ట్రేషన్ సమయం అయిపోతుందని అడిగాడు. ఆందోళన చెందిన ఆయన, కొడుకును నిలదీయగా ఆన్‌లైన్ గేమ్‌లో నగదు అంతా పోయిందని చెప్పడంతో కన్నీరు మున్నీరయ్యారు.
Hyderabad, DEC 21: ఆన్‌లైన్ గేమ్‌కు (Online game) బానిసైన ఓ డిగ్రీ విద్యార్థి నుంచి సైబర్ నేరగాళ్లు (Cyber Crime) రూ.95 లక్షలు కాజేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాబాద్ మండలం సీతారాంపూర్‌కు చెందిన చన్‌వెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు గ్రామంలో 10 ఎకరాల దేవాదాయశాఖ భూమిలో వ్యవసాయం చేసుకొంటున్నారు.
ఆ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరిస్తున్నది. ఇందులో భాగంగా వీరి భూమికి ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున రూ.1.05 కోట్లు పరిహారం ఇచ్చింది. ఈ డబ్బుతో పక్కనే మల్లాపూర్‌లో అరెకం భూమిని రూ.70 లక్షలకు కొని, రూ.20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకొన్నాడు. మిగతా రూ.95 లక్షలను శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు బ్యాంకు ఖాతాల్లో దాచుకొన్నారు.
శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌లో రమ్మీ (Rummy), క్యాసినో (Casino) పేరుతో వచ్చిన ప్రకటన క్లిక్ చేయగా కింగ్ 567 గేమింగ్ యాప్ డౌన్‌లోడ్ (King 567) అయ్యింది. తొలుత ఆ గేమ్‌లో తక్కువ పెట్టుబడితో ఆడిన హర్షవర్ధన్‌కు (Harshavardhan) లాభాలు వచ్చాయి.
ఆశతో మరింత పెట్టుబడి పెట్టగా నష్టాలు రావడం ప్రారంభ మయ్యాయి. నష్టాలు పూడ్చేందుకు మరింత బెట్టింగ్ (Betting) పెడుతూ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కిపోయాడు. మరిన్ని పాయింట్లు ఇస్తామంటూ ఆశచూపి మరోమారు అతడితో మరింత పెట్టుబడి పెట్టించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.95 లక్షలను ఊడ్చేశారు.
భూమిని అమ్మిన వ్యక్తికి నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తానని హర్షవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రుల ఖాతాల్లో ఉన్న రూ.95 లక్షలను తన ఖాతాలోకి బదిలీ చేసుకొన్నాడు. ఇటీవల భూ యజమాని నుంచి శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. ఇంకా డబ్బు రాలేదు, రిజిస్ట్రేషన్ సమయం అయిపోతుందని అడిగాడు.
ఆందోళన చెందిన ఆయన, కొడుకును నిలదీయగా ఆన్‌లైన్ గేమ్‌లో నగదు అంతా పోయిందని చెప్పడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ రమ్మీపై రాష్ట్రంలో నిషేధం ఉన్నది.