Rythu Bandhu: రైతు రుణమాఫీ, రైతుబంధు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. వానాకాలం పంట సీజన్ ఆరంభమయ్యే నాటికి నేరుగా రైతుల ఖాతాల్లోనే రైతు బంధు నిధులు జమ చేయబడతాయని వెల్లడించిన మంత్రులు
ఇందుకు సంబంధించి రూ. 7 వేల కోట్ల రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు......
Hyderabad, May 8: తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. అలాగే వానాకాలానికి గానూ రైతుబంధు పథకం కింద ఇచ్చే పంట పెట్టుబడి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ. 25 వేల లోపు రుణాలు కలిగి ఉన్న రైతుల పంట రుణాన్ని ఏక మొత్తంలో మాఫీ చేస్తూ రూ. 1200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆరు లక్షల పదివేల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలలో ఈ రుణ మొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అలాగే రూ. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ మరియు రూ. 1 లక్ష లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణ చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
దీంతో పాటు వానాకాల పంటకు పెట్టుబడి సాయంగా జూన్ మాసంలో 'రైతుబంధు' పథకం కింద అందివ్వాల్సిన నిధులను కూడా విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించి రూ. 7 వేల కోట్ల రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.
అర్హులైన రైతులందరికీ రైతుబంధు నిధులు వారి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయబడతాయని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పంట సీజన్ ఆరంభమయ్యే నాటి కల్లా ఈనెల రోజుల్లో రైతుబంధు నిధులు రైతులకు చేరేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు ఆదేశించారు.