Telangana Dalit Bandhu Scheme: దళితబంధు అమలుకు రూ.500 కోట్లు విడుదల, హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పథకం కింద రూ.500 కోట్లు విడుదల (Telangana govt releases Rs 500 Cr) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.
Hyderabad, August 9: హుజురాబాద్ నియోజకవర్గంలో 'దళితబంధు' (TS Dalit Bandhu) అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పథకం కింద రూ.500 కోట్లు విడుదల (Telangana govt releases Rs 500 Cr) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. కాగా హుజురాబాద్‌లో (Huzurabad) ‘దళిత బంధు’ పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీతో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తదితరులను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దళితబంధు అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బంధు పథకం అమలు కానుంది.
ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద రూ. 7.60 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.