Telangana: తెలంగాణలో మద్యం దుకాణాలు, థియేటర్లపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై పరిమితి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల చర్యలు పెంచాలని ఆదేశం

రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్19 కేసులను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు, పబ్బులు, మద్యం విక్రయించే క్లబ్ లు మరియు సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది....

High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyderabad, April 8: మద్యం షాపులు కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా తయారవుతున్నాయని తెలంగాణ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్19 కేసులను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు, పబ్బులు, మద్యం విక్రయించే క్లబ్ లు మరియు సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని నివారించటానికి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం ఒక నివేదికను సమర్పించింది. దీనిపై స్పందించిన కోర్టు, ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు తక్కువగా చేస్తుండటం పట్ల మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ధేషించిన మార్గదర్శకాల ప్రకారం ఆర్టీ-పిసిఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని సూచించింది. కోవిడ్ నెగెటివ్ రిపోర్టులు లేకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారిని పరిమితం చేయాలని పేర్కొంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవారికి తప్పకుండా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరింది. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.

ఇక కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల తీసుకుంటున్న చర్యలపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.16 వేల మందికి జరిమానా విధించటం అంటే తనిఖీలు తక్కువ చేస్తున్నట్లుగా పేర్కొంది. రెండు రోజుల పాటు పాతబస్తీలో తనిఖీ చేసినా లక్షమంది పైగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారు దొరుకుతారని హైకోర్ట్ వ్యాఖ్యానించింది.

రాష్ట్రంలో లాక్డౌన్ విధించకపోయినా, కంటైన్మెంట్ జోన్లను మాత్రం ఖచ్చితంగా కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో టీకా డ్రైవ్ నిర్వహణ గురించి హైకోర్ట్ ఆరా తీసింది. 100 మంది సిబ్బంది గల కార్యాలయాల్లోని ఉద్యోగులకు వారు పనిచేసే చోటే టీకాలు వేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇక దీనిపై తదుపరి విచారణను హైకోర్ట్ ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.