Disproportionate Assets Case: అక్రమాస్తుల కేసు, సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు
జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటిషన్ వేశారు. ఎన్నికలు జరిగే లోపల ఈ కేసులపై తీర్పులను వెలువరించాలని పిటిషన్ లో ఆయన కోరారు.
Hyd, Nov 8: అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటిషన్ వేశారు. ఎన్నికలు జరిగే లోపల ఈ కేసులపై తీర్పులను వెలువరించాలని పిటిషన్ లో ఆయన కోరారు. అయితే, ఆయన పిటిషన్ ను పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ కొంత అభ్యంతరం తెలిపింది. ఈ అభ్యంతరాలపై హైకోర్టులో సుదీర్ఘ వాదలను కొనసాగాయి.పిటిషనర్ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ పిటిషన్ ను విచారించారు. వాదనల అనంతరం పిటిషన్ ను పిల్ గా మార్చేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. పిల్ గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఈ కేసుల విషయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. జగన్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే.