Visakha, Nov 8: అనకాపల్లి జిల్లాలో ఫోన్‌లో దిశ యాప్ ఇన్‌స్టాల్ చేసే విషయంలో ఆర్మీ జవాన్‌పై పోలీసుల దాడి ఘటన కలకలం రేపింది. ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంపులో సైనికుడు. సెలవుపై ఈ నెల 2న ఇంటికి వచ్చారు.. ఆయన మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సుకోసం వేచి ఉన్నారు. అప్పటికే అక్కడున్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ఎం.ముత్యాలనాయుడు, శోభారాణి.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు.
సయ్యద్ అలీముల్లా ఫోన్‌లోనూ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. ఈ క్రమంలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ రాసుకున్నారు. ఓటీపీతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని జవాన్ అన్నారు. అలాగే కానిస్టేబుళ్ల బ్యాడ్జిలపై పేర్లు లేవని.. తనకు అనుమానం కలుగుతోంది అన్నారు. ఐడీ కార్డులు చూపించాలని కానిస్టేబుళ్లను అడిగారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు రెచ్చిపోయారు. అలీముల్లా కాలర్ పట్టుకుని లాగేయడంతో ఆయన కింద పడిపోయారు.
ఆ తర్వాత ఓ కానిస్టేబుల్ బూటుకాలితో తన్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ కూడా తనను కొట్టారని ఆయర ఆరోపించారు. ఐడీ కార్డు అడిగినంత మాత్రాన దాడి చేస్తారా అని పోలీసులను స్థానికులు ప్రశ్నించారు.అయితే ఆయన ప్రతిఘటించారు.. చివరికి పోలీసులు అతని ఐడీకార్డును తీసుకుని వెళ్లిపోయారు. అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణను కలసి ఘటనను బాధితుడు వివరించారు.
Here's Video
అనకాపల్లి జిల్లా పరవాడ సంతలో సరుకులు కొంటున్న ఆర్మీ ఉద్యోగిని దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోమన్న పోలీసులు. దురుసు ప్రవర్తన చూసి ఐడి కార్డ్ చూపమన్న ఉద్యోగి. ఆగ్రహంతో దాడి చేసిన పోలీసులు. ఘటనపై నలుగురిని ఆర్మ్ రిజర్వ్ అటాచ్ చేసిన ఎస్పీ. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/q0JyddoGvQ
— Vizag News Man (@VizagNewsman) November 7, 2023
జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్‌లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. ఇదే విషయాన్ని… pic.twitter.com/D0jdzn2Vzr
— Lokesh Nara (@naralokesh) November 8, 2023
ఆర్మీ ఉద్యోగి, పోలీసుల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ స్పందించారు. వెంటనే నలుగురు కానిస్టేబుళ్లను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ దిశ యాప్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. మహిళలకైతే ఒకే.... పురుషుల మొబైల్స్‌లో ఆ యాప్‌ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడంపై నారా లోకేశ్ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించినందుకు అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గుండాల్లా మారి దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు దాడికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు.