Saidabad Rape Case: రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశాలు, పోస్టుమార్టం వీడియోలు వరంగల్‌ జిల్లా జడ్జికి అందించాలని స్పష్టం చేసిన ధర్మాసనం

వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, Sep 17: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సైదాబాద్‌ సింగరేణి కాలనీ బాలికపై లైంగిక దాడి (Saidabad Rape Case), హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్‌ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. రాజు మృతిపై (Saidabad Rape accused Death) పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది.

రాజును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్‌ ఆరోపించారు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు, రాజు మృతదేహం పోస్టుమార్టం ప్రక్రియ వీడియో చిత్రీకరణ జరిగిందని కోర్టుకు చెప్పారు. ఈ మేరకు పోస్టుమార్టం వీడియోలు వరంగల్‌ జిల్లా జడ్జికి శనివారం రాత్రి 8గంటల్లోగా అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది.