High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, Sep 17: సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య (suicide of Saidabad rape accused) చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) (PIL filed in Telangana HC) దాఖలైంది. రాజు మృతిపై అనుమానాలు ఉన్నాయని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం వ్యక్తం చేశారు.

దీనిపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థిస్తూ.. లంచ్‌ మోషన్‌ పిటిషయన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నాం దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. చిన్నారి హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపినట్లయితే.. రూ.10లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభ్యమైంది. రైలుకు ఎదురెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

సైదాబాద్ చిన్నారి నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్‌పై లభ్యమైన మృత‌దేహం

కాగా.. రాజు ఆత్మహత్యపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడో రాజును పట్టుకుని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజు కుటుంబసభ్యులు, పలు ప్రజా సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందించారు. రాజు ఆత్మహత్యపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు. గ్యాంగ్‌మన్‌ కూడా నిందితుడు ట్రాక్‌పై తిరగడం చూశారు. రాజు రైలు కింద పడటం రైతులు సహా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారు. కోణార్క్‌ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులు. ఈ ఘటనలో ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిరాధార ఆరోపణలు తగదు’’ అని డీజీపీ అన్నారు.

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై తెగబడిన కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేసి హత్య, నిందితుడు ఇంట్లో చిన్నారి మృతదేహం, నిందితుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్‌

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో బంధువుల సమక్షంలో పోస్టు మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరంగల్‌ పోతన నగర్‌లోని స్మశాన వాటికలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.వరంగల్‌ మట్టెవాడ పోలీసుల సూచనతో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగం ఉద్యోగులు వరంగల్‌ పోతన నగర్‌ శ్మశానవాటికలో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.

వరంగల్‌ ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం పూర్తి కాగానే పోలీసుల పహారా మధ్య రాజు మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. అంత్యక్రియల క్రతువును నిందితుడు రాజు తల్లి పూర్తి చేశారు. ముగ్గురు కుటుంబ సభ్యులను మాత్రమే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించారు. పోతననగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించే అంశాన్ని పోలీసులు చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు.

రాజు ఆత్మహత్య ఘటనతో సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులోని అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోలీసులే కాల్చి చంపేశారని నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజును చంపి కడుపుకోత మిగిల్చారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.