Hyderabad, September 16: తెలంగాణలో సంచలనం సృష్టించిన చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ సమీపంలోని స్టేషన్ ఘన్ పూర్ రైల్వేట్రాక్ మీద రాజు మృతదేహం గుర్తించబడింది. నిందితుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్ధారించారు. సైదాబాద్ హత్యాచారం నిందితుడి ఆచూకీ లభ్యమైంది, అతడి మృతదేహం ఘన్ పూర్ రైల్వేట్రాక్ వద్ద గుర్తించామని తెలంగాణ డీజీపీ మహేంధర్ రెడ్డి అధికారికంగా ధృవీకరించారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సెప్టెంబర్ 9న సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య చేసిన ఘటన యావత్ సమాజాన్ని కలిచివేసింది. అప్పట్నించీ ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న అదే కాలనీకి చెందిన పల్లకొండ రాజు (30) కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వందలాది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజును పట్టుకునేందుకు దాదాపు తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలు మఫ్టీలో వేట కొనసాగించాయి. సెప్టెంబర్ 14న, హైదరాబాద్ పోలీసులు నిందితుడి భౌతిక రూపానికి సంబంధించిన వివరాలతో ప్రజలకు నోటీసు జారీ చేశారు మరియు విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ .10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. పోలీసులు అతని చిత్రాలతో కూడిన వాంటెడ్ పోస్టర్‌లను సెప్టెంబర్ 15 న విడుదల చేశారు. పోలీసు సిబ్బంది గోడలు, బస్సులు మరియు ఆటో-రిక్షాలపై పోస్టర్లను అతికించడం కనిపించింది. నిందితుడు ఎలా కనిపిస్తున్నాడో కొంతమంది పౌరులకు వివరించారు. చివరికి ఈరోజు రైల్వే ట్రాక్ మీద నిందితుడి శవంగా తేలాడు.
Here's the news:
#AttentionPlease : The accused of "Child Sexual Molestation and murder @ Singareni Colony, found dead on the railway track, in the limits of #StationGhanpurPoliceStation.
Declared after the verification of identification marks on deceased body. pic.twitter.com/qCPLG9dCCE
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 16, 2021
నిజానికి, ఈ హత్యాచారం ఘటనపై మొదట్లో సాంప్రదాయ టీవీ మీడియాలో పెద్దగా ప్రసారం కాకపోయినా, సమాజం మరియు సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నాయకులను, సినిమా స్టార్లను సమాజం నిలదీయడంతో దెబ్బకు ఒక్కొక్కరు హత్యాచారం గావింపబడిన బాధితురాలి ఇంటికి క్యూలు కట్టారు, దీక్షలు చేశారు. ఈక్రమంలో ప్రభుత్వంపై కూడా ఈ కేసుకు సంబంధించి ఒత్తిడి పెరిగిపోయింది. నిందితుణ్ని అరెస్ట్ చేసినా, ప్రజల ఆగ్రహ జ్వాలలు తగ్గించలేని స్థితి ఏర్పడింది. ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వచ్చినా, పూర్వం దిశ హత్యాచారం సమయంలో ఎన్ కాంటర్లో భాగస్వామ్యమైన పోలీసులకు మానవ హక్కుల కమీషన్, కోర్టు కేసులు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో సైదాబాద్ హత్యాచారం నిందితుడు ఒక అనాధలాగా శవమై పడిఉండటంతో పాపం పండింది, న్యాయం జరిగింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.