Saidabad Rape Case (Photo-Twitter/CCTV Footage)

Hyderabad, Sep 15: తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో (Saidabad Rape Case) నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 బృందాలను ఏర్పాటు చేయగా.. తాజాగా మరో ఐదు స్పెషల్ టీంలను పోలీస్‌ అధికారులు (Hyderabad police) నియమించారు. ఈ బృందాలన్నీ మంగళవారం సాయంత్రం నుంచి మూడు పోలీస్‌ కమిషనరేట్లలో నిందితుడి కోసం జల్లెడపట్టడం ప్రారంభించాయి.

మరోవైపు ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. నిందితుడు రాజు కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబంధీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కే ప్రయాణికుల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిందితుడి ఫోటోలను అన్ని బస్టాండుల్లో అంటించాలని ఆదేశించారు.

ఇప్పటికే బస్టాండ్‌, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు (Hyderabad police announce Rs 10 lakh reward) ప్రకటించిన విషయం తెలిసిందే. అతను కనిపించినా, సమాచారం తెలిసినా వెంటనే డయల్‌ 100 లేదా 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోపక్క రాజు ఎక్కడ ఉండే అవకాశాలున్నాయో చర్చించి పరిశోధించాలని అడిషనల్ డీజీపీ షికా గోయల్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Hyderabad Police Tweet

చిన్నారి హత్యాచారం జరిగిన రోజే తప్పించుకుని పారిపోయిన రాజును పట్టుకునేందుకు సైదాబాద్‌ పోలీసులు అతడి కుటుంబ సభ్యులు, బంధువులను, పరిచయస్థులను విచారిస్తున్నారు. తన కుమారుడు వ్యసనాలకు బానిస కావడంతో అతడిని వదిలేసి తాను కూతురి వద్ద ఉంటున్నానని రాజు తల్లి చెప్పినట్లు సమాచారం. వ్యసనపరుడైన రాజుతో తమకు కొన్నాళ్లుగా సంబంధాలు లేవని మిగిలిన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పేర్కొన్నారు. చిన్నారిని చంపేసిన వెంటనే రాజు ఎక్కడికి పారిపోయాడో తెలుసుకునేందుకు ఘటనా స్థలం నుంచి నాలుగు వైపులా సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై తెగబడిన కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేసి హత్య, నిందితుడు ఇంట్లో చిన్నారి మృతదేహం, నిందితుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్‌

సైదాబాద్‌ బస్తీ నుంచి రాజు, అతడి స్నేహితుడు కొద్దిదూరం వరకూ వెళ్లినట్టు.. ఆపై ఎల్బీనగర్‌ జంక్షన్ వరకూ రాజు వెళ్లినట్టు సీసీ ఫుటేజీల ద్వారా తెలిసింది. ఎల్బీనగర్‌ నుంచి హంతకుడు ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడంతో దర్యాప్తు అక్కడితో ఆగిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ విజయవాడ, నల్గొండ, సూర్యాపేట, ఉప్పల్‌, ఆరాంఘర్‌ వైపు వెళ్లిన బస్సులు, వాహనాల వివరాలను సేకరించిన పోలీసులు అందులో ప్రయాణించిన వారికి రాజు ఫొటోను చూపించారు.

ఎల్బీనగర్‌ పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లతో పాటు నిర్మానుష్య ప్రాంతాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. చిన్నారి హత్యాచార ఘటన జరిగి ఇన్నిరోజులైనా నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంతో పోలీసులు, ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది.

Here's Mahes Babu Tweet

Minister KTR tweet

Hero Nani Tweet

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హీరో మహేశ్‌ బాబు స్పందించారు. 'ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం' అంటూ మహేశ్‌ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. మరోవైపు హీరో మంచు మనోజ్‌ సైతం బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించిన మనోజ్‌.. ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు.

హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై ఆటో డ్రైవర్ రాజు (30) హత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా చంపేశాడు. పసిపాపను దారుణంగా హత్యచేసిన నిందితుడిని గుర్తించి అప్పగించేంతవరకు పాప మృతదేహాన్ని కదిలించేది లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కాలనీలో అదృశ్యమైన బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. పాప ఆచూకీ తెలియకపోవడంతో ఆటో రాజుపై అనుమానం వచ్చింది. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. జనాలతో దురుసుగా ప్రవర్తించేవాడు. అతడే పాపను ఏమైనా చేశాడమేననే అనుమానంతో అర్థరాత్రి అతడి ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు.

వారి అనుమానమే నిజమైంది.. చిన్నారి ప్రాణాలు కోల్పోయి విగతజీవిలా పడి ఉంది. ఆడుకుంటూ కేరింతలు కొట్టిన చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ పాపను దారుణంగా హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజులు గ‌డుస్తున్నా నిందితుడి గురించి ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు.