Saidabad, Sep 11: భాగ్యనగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం (Hyderabad Shocker) చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు లైంగిక దాడి చేసి హత్యకు (Six-year-old raped, killed) పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నిందితుడు రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది.
నిందితుడు రాజును తమకు అప్పగించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని బస్తీవాసులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాలనీలో 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలోని రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాజును హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ వెల్లడించారు. తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాలిక హత్యాచారం ఘటనలో నిందితుడు రాజును బహిరంగంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆగ్రహంతో రహదారిపై వాహనాలను అడ్డుకుంటున్నారు. సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కర్మన్‌ఘాట్-చంపాట్ రహదారిపై చిన్నారి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
బాధితుల నిరసన గురించి తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తాం.. నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి 50 వేల రూపాయల చెక్ అందజేశారు. అంతేకాక కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ జాబ్ ఇస్తామని.. కలెక్టర్ పరిధిలో ఏం ఇవ్వగలమో అవన్ని అందేలా చూస్తామని తెలిపారు. ఆరేళ్ల చిన్నారి తల్లితో కలెక్టర్ మాట్లాడారు.
డీసీపీ రమేష మాట్లాడుతూ.. ‘‘ఈ కేసును ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతం చేసేలా చేస్తాం.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. బాధితుల నిరసనలో పోలీసులకు గాయాలు అయ్యాయి. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సాగర్‌రోడ్డుపై పూర్తిగా రాకపోకలు బంద్ చేశాము. ఉద్రిక్తత పరిస్థితులు దృష్ట్యా భారీగా పోలీసులను మోహరించాం’’ అని తెలిపారు.