Minister Uttam on Kaleshwaram Project: నీటిపారుదల శాఖలో భారీ అవినీతి, మొత్తం బయటకు తీస్తామని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తామని వెల్లడి
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) చెప్పారు.
Hyd, Dec 12: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటిని డిజైన్ చేసిన, నిర్మించిన వారిని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై (Minister Uttam on Kaleshwaram Project) సవివరంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నీటిపారుదల శాఖను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమవారం జలసౌధకు వచ్చిన మంత్రి.. ఈ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై ఈఎన్‌సీ సి.మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు.
సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత పాటిస్తున్నారని, రహస్య జీవోలు ఇచ్చారంటూ అనేక ఆరోపణలున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇకపై శాఖ పనితీరు పారదర్శకంగా ఉండాలని, సమర్థతను పెంచుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు వంటి అంశాలపై సరైన అధ్యయనాలు లేకుండానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు.
కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.లక్ష కోట్లను ఖర్చు చేసినా, ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తోందన్నారు. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి ప్రాజెక్టు కింద స్థిరీకరించిన కొత్త ఆయకట్టు, ప్రాజెక్టుల నిర్వహణకు కానున్న విద్యుత్ చార్జీల వ్యయం ఇతర అంశాలపై సమగ్ర నివేదిక కోరామన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని చెప్పారు. ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేస్తామని చెప్పారు. సీఎంతో పాటు, మంత్రివర్గంలో చర్చించి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల బిల్లులు విడుదల చేస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మంత్రిగా ఈ నెల 14న బాధ్యతలు స్వీకరిస్తానని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సమీక్షలో ఈఎన్‌సీలు బి.నాగేందర్ రావు, హరిరామ్, అనిల్‌కుమార్, సీఈలు హమీద్‌ఖాన్, అజయ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా ఈ సమీక్షకు ఆ శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి స్మితా సబర్వాల్ గైర్హాజరు అయ్యారు.