Telangana: కులాలు వేరు, అయినా పీకల్లోతు ప్రేమలో మునిగిన మైనర్లు, తల్లిదండ్రులు మందలించడంతో రైలు కిందపడి ఆత్మహత్య, వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన
రైలుకింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణం (Lovers commits suicide) చెందింది. ఆత్మహత్య చేసుకున్న మృతులిద్దరూ మైనర్లే. ఈ సంఘటన గురువారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కడ్చర్లలో చోటుచేసుకుంది
Hyd, June 24: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైలుకింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణం (Lovers commits suicide) చెందింది. ఆత్మహత్య చేసుకున్న మృతులిద్దరూ మైనర్లే. ఈ సంఘటన గురువారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కడ్చర్లలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. కడ్చర్ల గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (18), ధారూర్ మండలం ఎబ్బనూర్‌కు చెందిన అభినయ (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరిలో పవన్ ఇంటర్ సెకండియర్ ఆపేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.అభినయ ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నప్పుడు పవన్, అభినయ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి విషయం కుటుంబ పెద్దలకు తెలిసింది. ఈ వయసులో ప్రేమలు ఏమిటంటూ మందలించారు. అయినా ఇద్దరి కులాలు వేర్వేరని చెప్పారు. తమ పెళ్లికి వయసు, కులాలు అడ్డుగా ఉన్నాయని మనస్తాపం చెందిన పవన్, అభినయ.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
బుధవారం రాత్రి ఇద్దరూ బయట కలుసుకొని ద్విచక్ర వాహనంపై కడ్చర్ల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12:30 సమయంలో హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్లి బలవన్మరణం (falling under train) చెందారు. రైలు వేగం ధాటికి పవన్ తల 200 మీటర్ల దూరంలో పడింది. గమనించిన రైలు డ్రైవర్ వికారాబాద్ స్టేషన్ మాస్టర్‌కి సమాచారం ఇచ్చారు. మృతదేహాలను చూసి ఇరువురి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈవిషాద ఘటన తట్టుకోలేక మృతురాలి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్‌ఐ నర్సింగ్ రాథోడ్ తెలిపారు.