Mega Job Mela in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మెగా జాబ్‌ మేళా, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి ఇది కేంద్ర బిందువు అవుతుందని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వమించిన ఈ జాబ్‌ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది.

MLC Kavitha (Photo-Twitter/Kavitha)

నిజామాబాద్‌లో శుక్రవారం తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వమించిన ఈ జాబ్‌ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎమ్మెల్సీ గణేశ్‌ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లాలో ఐటీ హబ్‌ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు. విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన మహేశ్‌ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఐటీ హబ్‌ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. యువత తమ నైపుణ్యాలతో ఐటీ హబ్‌ స్పేస్‌ను వాడుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

నిజామాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి ఐటీ హబ్‌ కేంద్ర బిందువు అవుతుందని తెలిపారు. ఇది మొదటి దశ మాత్రమే అని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్‌ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్‌ పార్క్, ఆటో పార్క్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిజామాబాద్‌ ఐటీ హబ్‌ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన జాబ్‌ మేళాకు వచ్చిన రెస్పాన్స్‌ పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను కూడా లెక్కచేయకుండా ఉద్యోగార్థులు జాబ్‌ మేళాకు హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబ్‌ మేళాతో ఎంతోమంది యువతీయువకుల కలలు సాకారం కాబోతున్నాయని ఆమె అన్నారు. ఇందుకోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగాలు, అభివృద్ధి, కొత్త అవకాశాలతో మాత్రమే దేశం ముందుకెళ్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

శనివారం వరకు స్కూళ్లకు సెలవులు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం, ఐటీ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో అరూప టెక్నాలజీస్‌, భారత్‌ క్లౌడ్‌, బ్రియో టెక్నాలజీస్‌, చిత్రపురి ఫిల్మ్‌ఫెస్టివల్‌, క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌, ధరణి జియోస్‌పాటియల్‌ టెక్నాలజీస్‌, డిజిటల్‌ ఎమ్‌ఎల్‌ సొల్యూషన్స్‌, డీఎస్‌ టెక్నాలజీస్‌, హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్ట్స్‌ , ఐటీ అమెరికా, ప్రణతి సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌, వీటెల్‌ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌, విమాక్స్‌ ఈ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ తదితర కంపెనీలు పాల్గొన్నాయి.