
Telangana declared two days holiday for schools: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురవనుందని, కొన్ని ప్రాంతాల్లో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ పడే అవకాశం ఉందని, నగరవాసులు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మేయర్ తెలిపారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలు పూర్తిగా జలమయ్యాయి. ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ సమీపంలోని కాలనీలు పూర్తిగా మోకాళ్ల లోతు నీటితో కాలనీలు మునిగాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండడం, ఆఫీస్ నుండి ఇండ్లలోకి వెళ్లేవారు తమ వాహనాలను సైతం ఆ మోకాల్లోతు నీళ్లలో నడిపించుకుంటూ వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రేపు శుక్రవారం, శనివారం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని అనుమతించాలని అన్ని IT & ITES కంపెనీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.