రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో గడిచిన 72 గంటలుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు, భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటూ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, బోరబండ, కూకట్ పల్లి, మాదాపూర్, ఫిల్మ్ నగర్ లలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలలో డీఆర్ఎఫ్ టీమ్ లను అందుబాటులో ఉంచాలని మేయర్ ఆదేశించారు.
శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా సిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, నగరవాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం 9000113667 నెంబర్ లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.