Holidays For Schools: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు, భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటూ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
School | Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, July 20:  భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు (Holiday) ప్రకటించింది విద్యాశాఖ. సీఎం కేసీఆర్ (Cm KCR) ఆదేశాల మేరకు రెండు రోజుల పాటూ సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో ముందుజాగ్రత్తగా రెండు రోజుల పాటూ సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్‌, 7 జిల్లాలకు ఆరెంజ్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. సియర్‌ సూన్‌ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు జలాశయాల్లో నీటి మట్టం, ఎత్తు తక్కువ కల్వర్టులు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల కలెక్టరేట్లలో ఇప్పటికే కంట్రోల్‌ రూమ్‌లను, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.