Telangana Weather Update: తెలంగాణకు అతి భారీ వర్షాల హెచ్చరిక, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్ జారీ, భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి
Hyderabad Rains

Heavy rains to lash Telangana; IMD issues warning: తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో చెట్టు, కరెంట్‌పోల్‌ పడిపోయాయి. అయితే ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది

ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌లో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి.కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి.మెదక్‌ వెల్దుర్తిలో 15 సెం.మీలు, దామరంచలో 13 సెం.మీ. రాజపల్లిలో 12 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.యాదాద్రి భువనగిరి రాజాపేట మండలం పరిధిలో ఏకంగా 17 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు, భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటూ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

జయశంకర్‌ భూపాలపల్లి సహా భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో 16వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరంగల్‌ వెంకటాపురంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.గోదావరికి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో.. భద్రాచలం వద్ద 39 అడుగులకు చేరింది నీరు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

Here's Rain Videos

అటు ప్రాణహిత, ఇటు ఇంద్రావతి నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరికి భారీ వరద పార్రంభమైంది. బుధవారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద ఆరు లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దాటే అవకాశం ఉంది. గోదావరిలో ఎగువన ప్రవాహం నామమాత్రంగా ఉన్నా.. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత పెరుగుతోంది.ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఇంద్రావతి నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద గోదావరిలో చేరుతోంది. తాలిపేరు నుంచి మరో 60 వేల క్యూసెక్కులు వస్తోంది.

భద్రాచలం వద్ద 35.20 అడుగుల మట్టంతో ప్రవాహం ఉండగా.. 5,97,982 క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. వాజేడు మండలం పేరూరు వద్ద రాత్రి 8 గంటలకు 39 అడుగుల మట్టంతో గోదావరి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. దిగువన పోలవరం వద్ద లక్షా 65 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 33,760 క్యూసెక్కుల వరద వస్తోంది.

కడెం ప్రాజెక్టులోకి 8,700 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, ఒక గేటు ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సింగూరు, నిజాంసాగర్‌లోకి కూడా కొంత ప్రవాహం ఉంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో ప్రవాహం నామమాత్రంగానే ఉంది. ఆలమట్టిలోకి 21 వేల క్యూసెక్కులు, తుంగభద్రలోకి సుమారు 9,800 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram Project) జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం ప్రధాన పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి ఇన్ ఫ్లో, 4,38,880 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్థ్యం16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 7.646 టీఎంసీలుగా ఉంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బ్యారేజీలోని 57 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రోడ్డుపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. విషయం తెలిసిన వెంటనే డీఆర్‌ఎఫ్ సిబ్బంది పెద్దమ్మ టెంపుల్ ప్రధాన రహదారి వద్దకు చేరుకుంది. రోడ్డుపై నిలిచి ఉన్న వరద నీరును క్లియర్ చేసే పనిలో డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు.