KTR Speech in Bhupalpally: రేపో మాపో మా పులి కేసీఆర్ బయటకు వస్తాడు, అందరి లెక్కలు సరిచేస్తాడు, భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
Hyd, Oct 9: తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం తొలి బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లిలోని సుభాష్ కాలనీ ప్రాంతంలో గల మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చోని కూడా ప్రజల కోసం అన్ని చేస్తున్నాడని తెలిపారు. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారని చెప్పారు. రేపో మాపో పులి బయటకు వస్తది.. వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన పనులు మీ కళ్ళ ముందున్నాయని ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయని.. రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బందుకు జై భీమ్ అంటారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హయాంలో రూ. 200 పెన్షన్ ఇచ్చేటోళ్లు అని కేటీఆర్ గుర్తు చేశారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రూ. 75 పెన్షన్ ఇచ్చేది. ఇవాళ మీరంతా కేసీఆర్‌ను గెలిపించుకున్న తర్వాత 200 ఉన్న పెన్షన్ 10 రెట్లు పెరిగింది. రూ. 2 వేల పెన్షన్ అయింది. దివ్యాంగులకు పెన్షన్లు పెంచాం. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. బీడీలు చుట్టే అక్కాచెళ్లెళ్లు 16 రాష్ట్రాల్లో ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారా..? ఆ దిశగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? రెండున్నర లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? అని కేటీఆర్ నిలదీశారు.
మన దగ్గర ఊరికి పదో, పదిహేను మంది బీడీ కార్మికులు మిగిలిపోయి ఉంటారు.. తప్పకుండా వారిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం.. మిగిలిపోయిన వారికి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది అని కేటీఆర్ స్పష్టం చేశారు. మీ మనసులో ఉన్న కోరిక కేసీఆర్‌కు తెలుసు. మీరు ఏమనుకుంటున్నారో తెలుసు. మరి కాంగ్రెసోడు కూడా చెప్పవటే కదా..? బీజేపోడు కూడా నరకవట్టే కదా..? మరి కేసీఆర్ చెప్పకపాయే.. ఏం సంగతి అని ఊర్లళ్ల ఎదురుచూస్తున్నారు.. అది మాకు తెలుసు. కేసీఆర్ మొత్తం లెక్కాపత్రం రాసుకుంటున్నారు
ఎన్నికల వేళ ఏం ఏం చేయాలని కేసీఆర్ అన్ని లెక్కలు తీస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా బాధ్యతతో మాట్లాడుతాం. వానిది ఏం పోయింది కాంగ్రెసోనిది. నెత్తి వాన్ది కాదు.. కత్తి వాన్ది కాదు.. ఎటువడితే అటు గీకుతాడు. గెలిచేది లేదు, పీకేది లేదు. ఎటువడితే అటు మాట్లాడుడే. కాంగ్రెస్‌ను నమ్మే బుద్ది తక్కువ పరిస్థితిలో మనం ఉన్నామా? 60 ఏండ్లు మనల్ని వేధించారు. ఇవాళ వచ్చి ప్రశ్నలు వేస్తుంటే గమ్మత్తు అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు.
మొన్న ఓటుకు నోటు ఈరోజు సీటుకో రేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డిగా మారారు. అలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఆదానికో, అంబానికి అమ్మేస్తాడు. కాంగ్రెస్ హామీలను చూసి మా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా?. రేపు మా పో పులి బయటికి వస్తుంది. కేసీఆర్ బయటికి వచ్చి ఏం చేయాలో స్వయంగా ఆయనే చెబుతాడు. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసు.
కేసీఆర్ క్రెడిబిలిటీ ఉన్న హిస్టరీ. ప్రజల మీద విశ్వాసం ఉన్న నాయకుడు. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మద్దు. ఆగం కాకండి. ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయండి. మోసాన్ని మోసాన్ని జయించాలి. కాంగ్రెస్ వాళ్ళకు కర్నాటక నుంచి బీజేపీ వాళ్ళకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఇస్తే తీసుకొండి. ప్రమాణం చేయిస్తే తుపాల్ తుపాల్ అని నీకే వేస్తామని చెప్పండి. కళ్ళ ముందు అభివృద్ధి ఉంది. గుండె నిండా సంక్షేమం ఉంది. ఆరు దశాబ్దాలుగా మోసం చేసి చావగొట్టినోడు మళ్ళీ వచ్చి ఏదో చెబుతే నమ్మి మోసపోకండి’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగెస్ వాళ్ళకు దిక్కు లేక డబ్బు సంచులతో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన సన్నాసిని పట్టుకొని పీసీసీ పదవి ఇచ్చారు. ఆ మొగోడు చెబితే మనం ఓట్లేయాలట. సోనియమ్మని బలి దేవత అన్నాడు. 1200 మందిని బలి తీసుకున్నవారు దేవత కాదు బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అన్నాడు. ఇప్పుడు ముద్దపప్పు కాదు.. సుద్ద పప్పు అంటున్నాడు. ఆయన మాటలు నమ్ముదామా?. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ. క్రిమినల్ అలాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడదామా? అని ప్రశ్నించారు.