New Delhi, Oct 9: తెలంగాణతో సహా మొత్తం అయిదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నాం. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం అని తెలిపారు.ఐదు రాష్ట్రాల్లో 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 60.2 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తెలంగాణలో 119, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40, రాజస్థాన్‌లో 200, మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. మొత్తంలో ఐదు రాష్ట్రాల్లో 679 శాసనసభ స్థానాలున్నాయని తెలిపారు.మిజోరాం శాసనసభ పదవీకాలం డిసెంబర్ 17, ఛత్తీస్‌గఢ్ జనవరి 3, మధ్యప్రదేశ్ జనవరి 8, రాజస్థాన్ జనవరి 14, తెలంగాణ శాసనసభ పదవీకాలం జనవరి 18 ముగియనున్నట్లు పేర్కొన్నారు.
రాజస్థాన్‌కు నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న పోలింగ్ జరగనుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. ఇక చత్తీష్‌గఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సహా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు జరిపామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో పారదర్శకత, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం అదనంగా 1.01 లక్షల బూత్‌లకు వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వాల పరంగా ఎలాంటి హామీలు, అధికారిక ప్రకటనలు, జీవోలు జారీ చేసేందుకు వీలు ఉండదన్నారు రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ఆవిష్కరణలు ఆగిపోనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోనున్నాయి. సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో అన్నీ నిలిచిపోయాయి.
కాగా సోమవారం ఉదయం కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని రైళ్లను ప్రారంభించారు. 1. హడప్సర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు.. 2. జైపూర్ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూల్ పట్టణం వరకు.. 3. నాందేడ్ - తాండూర్ ఎక్స్‌ప్రెస్‌ను రాయచుర్ వరకు.. 4. కరీంనగర్ - నిజామాబాదు పాసెంజర్‌ను బోధన్ వరకు ప్రారంభించారు.