PM Modi Telangana Visit: ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన, రాష్ట్ర అభివృద్ధికి పెద్దన్నలా సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్‌లో రూ. 56,000 కోట్లకు పైగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను (Multiple Development Projects) ప్రారంభించి, శంకుస్థాపన చేశారు
Hyd, Mar 4: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్‌లో రూ. 56,000 కోట్లకు పైగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను (Multiple Development Projects) ప్రారంభించి, శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా మోదీ శంకుస్థాపన చేశారు. అండర్ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్- బేల- మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. ఒక ప్రధాన మంత్రి ఆదిలాబాద్‌కు రావడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం.
వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. రూ.56వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ అవసరాలు తీరుతాయి. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశాం. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుంది. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో భారత్ అభివృద్ధిపరంగా మరింత ముందుకెళ్తుంది. కేంద్రం తీసుకున్న చర్యలతో దేశవ్యాప్తంగా 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.
Here's ANI Video
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ప్రాజెక్ట్‌లో మిగిలిన వాటికి అన్ని విధాలుగా సహకరిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి సాదర స్వాగతం. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తామని అన్నారు.
మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి నిర్మించాలి. దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి అని కోరారు.
ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.