Konda Surekha vs Kavitha: మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి కొండాసురేఖ
ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖ కౌంటర్ (Konda Surekha vs Kavitha) విసిరారు.
Hyd, Feb 8: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని,ఆయన్ని పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కౌంటర్ (Konda Surekha vs Kavitha) విసిరారు. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha S) అన్నారు.
ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టులను పెంచి పోషించినది కేసీఆరేనని అన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్‌ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు? అని నిలదీశారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా? అని ఎద్దేవా చేశారు.
సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు కానీ బీఆర్‌ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని కొండా సురేఖ అన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు.
అంతకు ముందు టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని అన్నారు.
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..
కేసిఆర్ చేసిన పనులను తాము చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితువు పలికారు. సింగరేణిలో ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తోందని చెప్పారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను హైదరాబాద్ లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లని డైరెక్టర్‌లను నియమించారని అన్నారు. తెలంగాణ కు నిరంతర కరెంట్ ఇవ్వడంలో ఆంధ్రవాళ్లు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారని ప్రశ్నించారు. మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్ర అడ్వైసర్ ఎందుకు? అని ప్రశ్నించారు.