Hyderabad Rains: మళ్లీ మొదలైన వానలు, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్, హైదరాబాద్లో ఉదయం నుంచి భారీ వర్షం, మునిగిన లోతట్టు ప్రాంతాలు, 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం (Heavy Rain Lashes in Hyderabad) అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఏర్పడింది. ఆఫీసులకు వెళ్లే వారు నానా పాట్లు పడుతున్నారు.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు (Heavy rains in Telangana) కురుస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ కంటిన్యూ అవుతోంది.
నల్గొండ జిల్లాలోని తెల్ దేవరపల్లిలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షం పడగా... కరీంనగర్ జిల్లాలలో 5.4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, మేడిపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లె, నిర్మల్ జిల్లా వాద్యాల్లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది.
గురువారం సాయంత్రం విడుదల చేసిన వెదర్ రిపోర్ట్ ప్రకారం.. జులై 23 ఉదయం 08.30 వరకు.. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి.ఈ 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జులై 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలిక పాటి వానలు పడవచ్చని అంచనా వేసింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుండ పోత వానలు కురిసిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజుల పాటు వర్షాలు పడడంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహించాయి. ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో వరద ముంచెత్తింది. భద్రాచలంతో పాటు ఏపీలోని లంక గ్రామాల్లో చాలా వరకు నీట మునిగాయి. భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది.వర్షాలతో అతలాకుతలమైన గోదావరి నది పరివాహక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరద ముంపు నుంచి క్రమంగా బయటపడుతున్నాయి. అంతలోనే మళ్లీ వానలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించడం కొంత ఆందోళన కలిగిస్తోంది.