Telangana Rains: తెలంగాణలో మరో మూడో రోజుల పాటు భారీ వర్షాలు, 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Telangana Rains) పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Hyd, July 13: గత అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు మళ్లీ ఇంకో వార్త కంటి మీద కునుకులేకుండా చేసేందుకు రెడీ అయింది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Telangana Rains) పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
కాగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో (Heavy rains to continue next 3 days) రాష్ట్రం తడిసి ముద్దయింది. ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. నది పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది.
కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి.