Telangana: తెలంగాణలో ఒక్కరోజులోనే 117 పాజిటివ్ కేసులు నమోదు, ఇందులో 66 మాత్రమే రాష్ట్రానికి చెందినవి అని వివరణ ఇచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ
అత్యధికంగా 58 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి...
Hyderabad, May 29: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో రాష్ట్రంలో ఇంత పెద్దమొత్తంలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇప్పటివరకు ఇదే తొలిసారి. అయితే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కేసుల విషయంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిన్న పాజిటివ్ గా నిర్ధారించబడిన 117 కేసుల్లో రాష్ట్రం నుంచి నమోదైన కేసులు 66 మాత్రమేనని, మిగతా 51 పాజిటివ్ కేసుల్లో 49 మంది సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారేనని తెలిపింది. అందులోనూ కొంతమంది తెలంగాణ వారు ఉండగా, దేశంలో వేరు వేరు రాష్ట్రాలకు చెందిన వారు మరికొంత మంది ఉన్నారు. వీరిలో చాలామందికి సౌదీ లోనే కోరినా వైరస్ సోకింది. హైదరాబాద్ వచ్చిన తరువాత చేస్తున్న పరీక్షల్లో వీరికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య మంత్రి ఈటల రాజేంధర్ వెల్లడించారు.
దీని ప్రకారం ఇతర ప్రాంతాలవి కాకుండా, తెలంగాణ రాష్ట్రం లోపల నిన్న కొత్తగా నమోదైన 66 కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1908 కు చేరింది. అత్యధికంగా 58 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 05, మేడ్చల్ నుంచి 2 కేసులు మరియు సిద్దిపేటలో మరొక పాజిటివ్ కేసు నమోదైంది.
గత 24 గంటల్లో మరో 24 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1345 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. మరోవైపు, రాష్ట్రంలో గురువారం మరో 4 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 67కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 844 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
ఇక నిన్న నమోదైన మొత్తం 117 కేసుల్లో 66 కేసులు లోకల్ గా నమోదైనవి పోగా, మిగతా 51 కేసుల్లో 49 కేసులు సౌదీ నుంచి వచ్చినవారివి, మరో 2 కేసులు వలస కార్మికులలో నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం విడిగా చూపుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే.. వలస కార్మికుల్లో ఇప్పటివరకు 175 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 143 మందికి మరియు విదేశీ ప్రయాణికుల్లో మరో 30 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మొత్తంగా తెలంగాణ వెలుపల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 348 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరంతా ప్రస్తుతం ఆర్మీ, ఏర్ఫోర్స్ క్వారెంటెన్ సెంటర్స్ లో ఉన్నారని మంత్రి ఈటల రాజేంధర్ తెలిపారు.
ఈ లెక్కన తెలంగాణలో నమోదైన కేసులు 1908కి ఈ 348 కేసులు కూడా కలిపితే తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటివరకు 2256 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు చెప్పవచ్చు.