Telangana: తెలంగాణలో కొత్తగా మరో 127 పాజిటివ్ కేసులు నమోదు, 3147కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 100 దాటిన కరోనా మరణాలు

ఇదిలా ఉంటే ఈరోజు మరో 31 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు...

Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, June 4: తెలంగాణలో గురువారం మరో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3147కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 2699 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 110 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే. ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి 7, రంగారెడ్డి జిల్లా నుంచి 6, ఆసిఫాబాద్ నుంచి 6, మేడ్చల్ నుంచి 2, సంగారెడ్డి మరియు ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

గురువారం మరో 6 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో, రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 105కు పెరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు మరో 31 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1587 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14555 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని మెడికల్ కాలేజీలకు, టీచింగ్ మరియు స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేష్ రెడ్డి ద్వారా ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. నగరంలో కరోనా తీవ్రత దృష్ట్యా వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు.