Telangana's COVID Report: తెలంగాణలో కొత్తగా మరో 178 పాజిటివ్ కేసులు, మరో 6 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో 3,920కి చేరిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య

వీలైనంతవరకూ బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ వాష్- రూమ్‌లను వాడకుండా ఉండాలని సూచించారు....

Coronavirus in India | (Photo Credits: PTI)

Hyderabad, June 9:  తెలంగాణలో మంగళవారం మరో 178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3,920 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,472 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 143 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి 15,  మేడ్చల్ నుంచి 10,  మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి 2 చొప్పున, అలాగే జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ మరియు వరంగల్ రూరల్ నుంచి  ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

మంగళవారం మరో 6 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 148 కు పెరిగింది.

  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1742 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2030 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

వీలైతే ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి: మహమూద్ అలీ

ప్రజలు COVID-19 బారిన పడకుండా ఉండటానికి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అన్ని ముందస్తు జాగ్రత్తలు మరియు నివారణ చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. ఆయన మాట్లాడుతూ... ఆర్థిక కార్యకలాపాలు మరియు సాధారణ ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని, ఇబ్బందులను సాధ్యమైనంత మేర తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు లాక్డౌన్ ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్ళ నుండి బయటికి రావడం జరుగుతుంది, ఇలాంటి సందర్భంలో నివారణ చర్యలు తీసుకోకపోతే కరోనా వైరస్ బారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.

హోటళ్ళు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా పనిచేయడం ప్రారంభించాయి మరియు అంతరాష్ట్ర ప్రయాణాలు కూడా సడలించబడ్డాయి, ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని మహమూద్ అలీ అన్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదు. వీలైనంతవరకూ బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ వాష్- రూమ్‌లను వాడకుండా ఉండాలని సూచించారు.

ప్రజలు బయటికి వెళ్ళేడప్పుడు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను గమనిస్తూ, హ్యాండ్ శానిటైజర్స్, మాస్క్ లు ఉపయోగించాలని మరియు భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో మేలని తెలిపారు.