COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1891 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 66 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య; ఆగష్టు 05 రాష్ట్ర మంత్రివర్గం భేటీ!
కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు...
Hyderabad, August 2: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 19,202 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1891 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1656 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,77,795 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 66,677కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 517 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 181, మేడ్చల్ నుంచి 146 , మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 111 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
ఇతర జిల్లాల నుంచి కూడా ఇటీవల కాలంగా వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 138 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా నుంచి 131, అలాగే కరీంనగర్ జిల్లా నుంచి 93 కేసులు వచ్చాయి.
Telangana's COVID19 Bulletin:
ఆగష్టు 1న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 10కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 540 కు పెరిగింది.
అలాగే, శనివారం సాయంత్రం వరకు మరో 1088 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 47,590 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,547 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఆగష్టు 5న కేబినేట్ భేటీ!
ఈ నెల 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, సెక్రటేరియట్ నూతన భవన సముదాయ నిర్మాణం తదితర అంశాలపై కేబినేట్ చర్చించనుంది.