COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 1,933 పాజిటివ్‌ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 3,527 మంది రికవరీ, రాష్ట్రంలో 25 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 160, నల్గొండ నుంచి 148 మరియు రంగారెడ్డి నుంచి 116 కేసుల చొప్పున నమోదయ్యాయి....

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, June 7: తెలంగాణలో కోవిడ్ కేసులు నిన్నటి కంటే ఈరోజు పెరిగాయి, నిన్న 15 వందల లోపే నమోదైన పాజిటివ్ కేసులు ఈరోజు మళ్లీ 2 వేలకు చేరువగా వచ్చాయి.  అయితే మరో వారం రోజులు గడిచేసరికి 15 వందల దిగువకు చేరుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతూ జూన్ చివరి నాటికి తెలంగాణలో సెకండ్ వేవ్ దాదాపు అదుపులోకి వస్తుందని,  రోజువారీ కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు సుమారుగా 500 - 600 మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఓ సర్వే అంచనా వేసింది.

కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ కూడా జూన్ 10 నుంచి ఎత్తివేసే అవకాశం ఉంది. దీనిపై నిర్ణయాన్ని మంగళవారం జరగనున్న కేబినేట్ భేటీ అనంతరం ప్రకటించనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే, జూన్ 21 నుంచి దేశవ్యాప్తంగా 18- 44 వయసు వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేపడతామని, ఆ బాధ్యత కూడా పూర్తిగా తమదేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,32,996 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1933 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1356 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,93,103కి చేరుకుంది. ఈరోజు  వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 160,  నల్గొండ నుంచి 148 మరియు రంగారెడ్డి నుంచి 116  కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 16 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,394కు పెరిగింది.

అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 3,527 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,64,303 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement