COVID19 in TS: నిఫా వైరస్‌పై కోవిషీల్డ్ లాంటి టీకా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి; తెలంగాణలో కొత్తగా 298 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 325 మంది రికవరీ
ఈ క్రమంలో కరోనావైరస్ ను ఎదుర్కొనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇకపై నిఫా వైరస్ పై కూడా పోరాడే సంజీవనిగా...
Hyderabad, September 7: గత రెండేళ్లుగా ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను వదలకుండా పట్టిపీడిస్తుండగా, మరోవైపు డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా నిఫా వైరస్ రూపంలో మరో కొత్త సమస్య వచ్చి చేరింది. కోవిడ్ విజృంభన తీవ్రంగా ఉన్న కేరళ రాష్ట్రంలో ఇటీవల ఓ బాలుడు నిఫా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. డెంగ్యూ వ్యాధిలాగే నిఫా వైరస్ నిర్మూలనకు కూడా ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్ ఆమోదించబడలేదు. అయితే నిఫా వైరస్ పై కోవిషీల్డ్ లాంటి టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు సంయుక్తంగా ఆఫ్రికన్ జాతికి చెందిన ఆకుపచ్చ కోతులలో ప్రయోగాలు చేయగా, కోవిషీల్డ్ ఫార్ములా కలిగిన వ్యాక్సిన్ అందించబడినవి నిఫా వైరస్ ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పోరాడినట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రమంలో కరోనావైరస్ ను ఎదుర్కొనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇకపై నిఫా వైరస్ పై కూడా పోరాడే సంజీవనిగా అభివృద్ధి చేసే దిశగా ఈ అధ్యయనం ఉపయోగపడనుంది.
ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,097 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 298 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,507 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,57,716కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 89 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,888కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 325 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,50,778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,476 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.