Corona in TS: సెకండ్ వేవ్ ఉధృతి.. కరోనా సోకిన 2-3 రోజుల్లోనే లక్షణాలు, తెలంగాణలో కొత్తగా 4,009 కోవిడ్ కేసులు నమోదు, సరిపడా వ్యాక్సిన్, ఆక్సిజన్ కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
కేంద్రం నుంచి 2.5 లక్షల డోసులు రావడంతో తిరిగి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Hyderabad, April 19: గతంలో కరోనా సోకినఫుడు 10- 12 రోజులకు లక్షణాలు కనిపించేవని, కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని కరోనా సోకిన కేవలం 2-3 రోజుల్లోనే లక్షణాలు పెరుగుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ అన్నారు. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సిన్ కొరతను వెంటనే నివారించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 25 ఏళ్లు పైబడిన వారికి కూడా కోవిడ్ టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదని ఈటల అన్నారు. రాష్ట్రానికి అవసరమైన పరిమాణంలో వ్యాక్సిన్ సరఫరా చేయడానికి కేంద్రం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.
అలాగే, ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున్న రాబోయే రోజుల్లో రోజుకి 300 నుంచి 350 టన్నుల వరకు అవసరమయ్యే ఆస్కారముంది. అయితే ఆక్సిజన్ కేటాయింపు కేంద్రం పరిధిలో ఉన్నందున భవిష్యత్తులో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా తమ అధికారులు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారని ఈటల రాజేంధర్ పేర్కొన్నారు.
ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 4,009 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 5,104 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,55,433కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 705 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 363 కేసులు, రంగారెడ్డి నుంచి 336, నిజామాబాద్ నుంచి 360, సంగారెడ్డి నుంచి 264 మరియు జగిత్యాల నుంచి 175 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 14 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,838కు పెరిగింది.
అలాగే ఆదివారం సాయంత్రం వరకు మరో 1,878 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,14,441మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్స్ కొరతతో ఆదివారం టీకాల పంపిణీ నిలిచిపోయింది. కేంద్రం నుంచి 2.5 లక్షల డోసులు రావడంతో తిరిగి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 36 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.
ఇదిలా ఉంటే, కోవిడ్ పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు మార్గదర్శాకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) రూపొందించిన ప్రామాణిక చికిత్సా ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆసుపత్రులలో కోవిడ్ పేషేంట్ల కోసం ఉపయోగించే ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు మరియు రెమ్‌డెసివిర్ వంటి ఔషధాల వంటి అందుబాటులో ఉన్న వనరులను హేతుబద్ధంగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది. వైద్యులు రోగులకు అవసరం లేని ప్రిస్క్రిప్షన్‌ను ఇవ్వకూడదు, అలాగే మెడికల్ షాపులు ఔషధాల కృత్రిమ కొరత సృష్టించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.