Corona in Telangana: వలస వస్తున్న వారిలో పెరుగుతున్న కరోనా కేసులు, తెలంగాణలో 1700 దాటిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, గడిచిన 24 గంటల్లో 62 పాజిటివ్ కేసులు, మరో 3 మరణాలు నమోదు
ప్రజలు భయాందోళనలు చెందవద్దని కోరిన మంత్రి, అయితే ఎవరికి వారుగా వ్యక్తిగత రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..
Hyderabad, May 23: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరగటం కనిపిస్తుంది. లాక్ డౌన్ ఆంక్షలు చాలా వరకు సడలించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి వచ్చే వారిలో చాలా మందికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1761 కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 42 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి మరొక పాజిటివ్ కేసు నమోదయింది. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మరో 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 118 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది.
మరోవైపు, రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా వరుసగా కోవిడ్ మరణాలు కొంత ఆందోళన కలిగిస్తుంది. శుక్రవారం మరో 3 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 48కి పెరిగింది.
శుక్రవారం మరో 7 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1043 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 670 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
కేసులు పెరగడం పట్ల మంత్రి ఈటల సమీక్ష
ఇక రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్యపై ఆరా తీసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంధర్, తన శాఖలోని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని మరింత పెంచాలని, పూర్తి స్థాయి సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంత మంది అవసరం అవుతారో రిపోర్ట్ అందించి, అందుకు అనుగుణంగా ఖాళీలను పూర్తి చేయాలని పేర్కొన్నారు.
వలస కార్మికుల వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తో మంత్రి ఈటల ఫోన్లో సంభాషించి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను 14 రోజుల పాటు హోటల్ లో క్వారంటైన్ చేస్తున్నామని చెప్పారు. అయితే వారిలో క్యాన్సర్ పేషెంట్లు, గర్భిణీ స్త్రీలు, డయాలసిస్ పేషంట్లు, ఇతర సీరియస్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వారికి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వారిని 7 రోజుల పాటు ఉంచి పరీక్ష చేసి నెగెటివ్ వస్తే వెంటనే హోం క్వారెంటెన్ చేసే అవకాశం ఇవ్వాలని కేంద్రమంత్రిని ఈటల కోరారు. పనిలోపనిగా, WHO కార్యనిర్వహక బోర్డ్ చైర్మన్ గా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి ఈటల అభినందనలు తెలియజేశారు.
ఇదిలా ఉంటే, కరోనావైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నమని, ప్రజలు భయాందోళనలు చెందవద్దని కోరిన మంత్రి, అయితే ఎవరికి వారుగా వ్యక్తిగత రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.