Coronavirus in Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన కోవిడ్-19 కేసులు, ఒక్కరోజులోనే 75 కేసులు నమోదు, 229కి చేరిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య, 11 మంది మరణం
ప్రస్తుతం 186 మంది పాజిటివ్ కేసులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.....
Hyderabad, April 4: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus in Telangana) పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులోనే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో 154గా ఉన్న కేసులు ఏకంగా 229కి పెరిగిపోయాయి. దిల్లీలోని మర్కజ్ (Nizamuddin Markaz) సమ్మేళనానికి హాజరై, తిరిగి వచ్చిన వారు రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉండటంతో వారి ద్వారా కేసులు పెరుగుతాయని ముందుగానే అధికారులు అంచనావేశారు. ఊహించినట్లుగానే ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. బుధ, గురు వారాల్లో గాంధీ ఆసుపత్రికి చెస్ట్ ఆసుపత్రికి కరోనాలక్షణాలతో వందల సంఖ్యలో వచ్చి చేరారు, ఈ క్రమంలోనే శుక్రవారం 75 కేసులు పాజిటివ్ గా నిర్ధారించబడ్డాయి.
శుక్రవారం మరో 2 కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. షాద్ నగర్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనావైరస్ సోకి మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. వీరంతా కూడా మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారేనని అధికారులు ధృవీకరించారు. తెలంగాణలో 15 జిల్లాలకు విస్తరించిన కరోనావైరస్ వ్యాప్తి, కేసులు పెరిగే అవకాశం
మర్కజ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారందరిని గుర్తించామని, వారిలో లక్షణాలు ఉన్నవారిని మరియు వారి కుటుంబ సభ్యులకు ఐసోలేషన్ సెంటర్స్‌కు తరలించి యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా, కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు 32 మంది కోలుకున్నారని, వీరందరినీ డిశ్చార్జ్ చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 186 మంది పాజిటివ్ కేసులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.