COVID-19 in Telangana: తెలంగాణలో 15 జిల్లాలకు విస్తరించిన కరోనావైరస్ వ్యాప్తి, మరిన్ని జిల్లాల నుంచి కేసులు పెరిగే అవకాశం, 154కు చేరిన మొత్తం పాజిటివ్ కేసులు
COVID 19 in Telangana. | Photo Credits: IANS)

Hyderabad, April 3: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ (COVID-19 in Telangana) చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తుంది. శుక్రవారం ఉదయం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది. గురువారం ఒక్కరోజే 27 కేసులు నమోదయ్యాయి, ఈ కేసుల సంఖ్య రాబోయే రెండు, మూడురోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గురువారం, కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రికి వచ్చిన రోగుల సంఖ్యతో ఈ రెండు ఆసుపత్రులు పూర్తిగా హౌజ్ ఫుల్ అయినట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు అన్ని కేసులు 'తభ్లిఘి జమాత్' మూలాలున్నవే అని తెలిసింది.

33 జిల్లాలున్న తెలంగాణలో ఇప్పటికే 15 జిల్లాలలో కోవిడ్-19 కేసులు నిర్ధారించబడ్డాయి. మరో 7 జిల్లాల నుంచి కరోనా అనుమానితుల రక్త నమూనాలు సేకరించారు, వీటి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మరియు కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

గడిచిన 48 గంటల్లో 6 జిల్లాల నుంచి తొలి కేసులు నమోదయ్యాయి. ఇందులో సంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి 6 కేసులు చొప్పున నమోదు కాగా, కామారెడ్డి, ములుగు జిల్లాల నుంచి 2 చొప్పున మరియు సిద్ధిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 1 కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి- ప్రధాని మోదీ

నిజామాబాద్, నిర్మల్ మరియు భైంసా పట్టణాలు వైరస్ హాట్ స్పాట్ (Coronavirus Hotspots) లుగా అధికారులు గుర్తించారు. నిర్మల్ జిల్లా నుంచి కనీసం 50 మంది వరకు నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు, 4 రోజులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మల్ నుంచి కరోనావైరస్ సోకి మరణించిన వ్యక్తి ఖననం అధికారుల సమక్షంలో పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సూర్యాపేట, భువనగిరి-యాదాద్రి, జగిత్యాల, పెద్దపల్లి, వనపార్తి, మంచిర్యాల మరియు నారాయణపేట జిల్లాల నుంచి ఇంతవరకు ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు నిర్ధారించబడలేదు. ఇవి తప్ప మిగతా జిల్లాలన్నీ కరోనావైరస్ ద్వారా ప్రభావితమైనాయి.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఇప్పటివరకు 9 కరోనావైరస్ మరణాలు సంభవించాయి. అన్నీ కూడా తబ్లిఘి జమాత్ సమ్మేళనానికి హాజరైనవారివేనని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం కేసులలో 17 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, మిగాతా వారికి చికిత్స కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.