PM Narendra Modi Message

New Delhi, April 3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం లాక్ డౌన్ యొక్క రెండవ వారం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న 11 రోజులు అత్యంత కీలకమైనవిగా మోదీ పేర్కొన్నారు.

కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై వచ్చి చేస్తున్న సమిష్టి పోరాటానికి (Fight Against COVID-19) సంఘీభావంగా ఈ ఆదివారం ఏప్రిల్ 05న రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రతి ఇంటిలోని సభ్యులు వారి ఇంట్లోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి గుమ్మం ఎదుట 9 నిమిషాల పాటు జ్యోతులను లేదా దీపాలను వెలిగించాలని కోరారు.

అదీకాకపోతే పౌరులందరూ తమ తమ బాల్కనీలలోకి, ఇంటి ప్రాంగణంలోకి వచ్చి మొబైల్ ఫోన్లలోని ప్లాష్ లైట్లు లేదా టార్చ్ లైట్లనైనా వెలిగించాలని సూచించారు. ఆ రకంగా దేశంలో కరోనావైరస్ ద్వారా వచ్చిన చీకటిని తరిమికొట్టాలని మోదీ చెప్పారు.  అంతేకాకుండా ఏప్రిల్ 05న దేశప్రజలందరూ మహా జాగరణ చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది భారతీయులు ఈ సమయాన్ని తనకు ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

మన సంకల్పానికి మించిన శక్తి ఏదీ లేదు, కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయులందరికీ నా ధన్యవాదాలు అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

Here's PM Modi's Message:

'జనతాకర్ఫ్యూ' విధించే సమయంలో కూడా ఆపత్కాలంలో నిర్విరామంగా సేవలందిస్తున్న వివిధ శాఖలకు చెందిన సభ్యులందరికీ సంఘీభావం తెలియజేస్తూ చప్పట్లు, గంటలు మోగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని, కరోనావైరస్ వ్యతిరేక పోరాటంలో దేశ ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలనే సూచికగా ఏప్రిల్ 5న జ్యోతులు వెలిగించాల్సిందిగా సూచించారు. ఇది దేశంలోని ప్రజలు ఒకరికొకరు సంఘీభావం తెలుపుకోవడం లాంటిది.

అంతకుముందు. గురువారం రోజు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాలలో కోవిడ్-19 వ్యాప్తి, లాక్ డౌన్ (Lockdown) అమలవుతున్న తీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించారు. రానున్న రాజుల్లో లాక్ డౌన్ మరింత పటిష్ఠంగా అమలు పరచాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. కొన్ని రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ముగింపుపై ప్రధానిని అడగగా, లాక్ డౌన్ ముగిస్తే రాష్ట్రాలు అందుకు సంసిద్ధంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఒక్కసారిగా జనాలకు స్వేచ్ఛ కల్పిస్తే వైరస్ వ్యాప్తి జరగకుండా రాష్ట్రాల వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? ఒక ప్రభావవంతమైన ఉమ్మడి వ్యూహాన్ని కలిగి ఉండం ఎంతో ముఖ్యం అని చెప్పారు.

ప్రతీ ఒక్క భారతీయుడిని వైరస్ నుంచి కాపాడే బాధ్యత మనందరిది, అందుకు ఏం చేయాలో బాగా ఆలోచించి మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా సీఎంలను ప్రధాని కోరారు.