Telangana's COVID Report: తెలంగాణలో కొత్తగా మరో 209 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4,320కి చేరిన కరోనా బాధితుల సంఖ్య, 165కు పెరిగిన కోవిడ్ మరణాలు
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 165 కు పెరిగింది....
Hyderabad, June 11: తెలంగాణలో గురువారం మరో 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,320 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,871మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్ లో కరోనావైరస్ విజృంభిస్తుంది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 175 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. సిటీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మేయర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారైంటైన్ లోకి వెళ్లారు. శుక్రవారం వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇతర జిల్లాల నుంచి వచ్చిన కేసులను పరిశీలిస్తే.. మేడ్చల్ నుంచి 10, రంగారెడ్డి 7, మహబూబ్ నగర్ 4, కరీంనగర్ జిల్లాల నుంచి 3 చొప్పున, వరంగల్ అర్బన్, ఆసిఫాబాద్, సిద్ధిపేట జిల్లాల నుంచి 2 చొప్పున అలాగే సిరిసిల్ల, వరంగల్ రూరల్, ములుగు మరియు కామారెడ్డి జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణ వెలుపల కరోనా సోకిన బాధితుల సంఖ్య 449కి పెరిగింది.
గురువారం మరో 9 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 165 కు పెరిగింది.
ఇదిలా ఉంటే ఈరోజు అత్యధికంగా 176 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1993 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2162 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక కరోనా బారిన పడుతున్న జర్నలిస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో కొత్తగా మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు మొత్తంగా 30 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలింది.