Telangana Shocker: ఆన్‌లైన్ బెట్టింగులు, అప్పులు ఎక్కువై టీచర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య , తెలంగాణలో విషాద ఘటనలు
ఘటనా స్థలానికి సూర్యాపేట ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ వచ్చారు. పోస్టుమార్టం తరువాత ఉపాధ్యాయుడి మృతదేహాన్ని ఊరికి తీసుకొస్తుండగా.. అప్పులిచ్చినవారు వాహనాన్ని అడ్డుకున్నారు
Hyd, August 12: తెలంగాణలో ఓ టీచర్ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు.అప్పుల బాధలు ఎక్కువ కావడంతో వీరిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు ... సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు (55-Year-Old Govt Teacher) గోదేశి నరేంద్రబాబు (55) చివ్వెంల మండలం గుంజలూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. నరేంద్రబాబు కుటుంబం సూర్యాపేటలోని శ్రీశ్రీనగర్‌లో నివాసముంటోంది. ఆయన భార్య ధనలక్ష్మి పెన్‌పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.
గత గురువారం నరేంద్రబాబు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య (Die by Suicide) చేసుకున్నారు. ఘటనా స్థలానికి సూర్యాపేట ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ వచ్చారు. పోస్టుమార్టం తరువాత ఉపాధ్యాయుడి మృతదేహాన్ని ఊరికి తీసుకొస్తుండగా.. అప్పులిచ్చినవారు వాహనాన్ని అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరలో రోడ్డుకు అడ్డంగా కంపచెట్లు వేశారు. పోలీసులు సర్దిచెప్పేవరకు వారు గ్రామంలోకి వాహనాన్ని అనుమతించలేదు. ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటుపడి పెద్దమొత్తంలో అప్పులు (Financial Losses) చేయడమే ఈ పరిణామాలకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన తండ్రి ఆరోగ్యం కోసం ఆస్తులన్నీ అమ్మేశాడు.. మిగిలిన రూ.20 లక్షలను షేర్ మార్కెట్‌లో పెట్టి నష్టపోయాడు. ఈ నేపథ్యంలోనే మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గత మంగళవారం జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసింది. అమీన్‌పూర్ సిఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు ... ఖమ్మం జిల్లా గోళ్లపాడుకు చెందిన గుడ్ల లక్ష్మీనారాయణ (37) (37-Year-Old Techie) అమీన్‌పూర్ పట్టణం పీజేఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
ఇంట్లోనే ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఊళ్లోని ఆస్తులను అమ్మి ఆసుపత్రిలో చూపించారు. రూ.20 లక్షలు మిగలడంతో వాటిని షేర్ మార్కెట్‌లో పెట్టారు. మొత్తం నష్టపోవడంతో కుటుంబ సభ్యులంతా లక్ష్మీనారాయణను నిలదీశారు. మనస్తాపానికి గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.