Telangana: అవమానం భరించలేక మంజీరా నదిలో దూకిన తల్లీకొడుకులు మృతి, ఆటో దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తీవ్ర మనస్థాపం
ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది.
Sangareddy, Nov 27: దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు ఆదివారం టాటా ఏస్ వాహనంలో వచ్చాడు.
సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొని వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో నిలిపాడు. అయితే అదే గ్రామానికి చెందిన తాగుడుకు బానిసైన వడ్ల శ్యామ్ (21) ఆ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. కౌడిపల్లి మండలం భుజిరంపేట మీదుగా వెళుతుండగా, రహదారి పక్కన గుంతలో ఇరుక్కుపోయింది. దానిని బైటకు తీసేందుకు అదే గ్రామంలో ఆరుబైట నిలిపిఉన్న ట్రాక్టర్‌ను తీసుకెళ్లి, ఆటోను తీస్తుండగా ట్రాక్టర్ కూడా ఇరుక్కపోయింది. వీటిని లాగేందుకు మరో ట్రాక్టర్‌ను తీసుకెళుతుండగా జరిగిన అలికిడికి గ్రామస్థులు మేల్కొని వెంబడించారు.
దీంతో శ్యామ్ వెంటనే సమీపంలోని ఓ బైక్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని సీసీ ఫుటేజీని పరిశీలించి వడ్ల శ్యామ్‌ను గుర్తించారు. గ్రామ పెద్దలతో సమావేశమై శ్యామ్‌ను తమకు అప్పగించాలని, లేకపోతే వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు. అనంతరం శ్యామ్ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు.
Woman, son dead after jumping into river Manjeera
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం శ్యామ్ అతడి తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి (46), చిన్నమ్మ మమత బుజరంపేటకు పంచాయితీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మ బస్‌లో బయలుదేరగా, శ్యామ్ తల్లి బాలమణితో బైక్‌పై బయలుదేరాడు. చింతకుంట బ్రిడ్జిపైకి రాగానే బైక్‌ను ఆపి మొదట శ్యామ్ మంజీరా నీళ్లలోకి దూకగా, అనంతరం తల్లి దూకింది. విషయం తెలుసుకున్న జోగిపేట, చిలప్‌చెడ్ పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ రోజు వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.