Sirpur Lockdown: తెలంగాణలో తొలి లాక్‌డౌన్ అమల్లోకి, కరోనా కేసుల పెరుగుదలతో స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకున్న మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామస్తులు, మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
కరోనాను కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్‌లో గ్రామస్థులు స్వచ్ఛంద లాక్‌డౌన్ (self-imposed lockdown) విధించుకున్నారు.
Sirpur, April 5: తెలంగాణలో తొలి లాక్‌డౌన్ నమోదైంది. కరోనాను కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్‌లో గ్రామస్థులు స్వచ్ఛంద లాక్‌డౌన్ (self-imposed lockdown) విధించుకున్నారు. ఆదివారం సర్పంచ్ భూక్యా గోవింద్‌నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై.. గ్రామంలో (Telangana Sirpur village) లాక్‌డౌన్ అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామంలో హెయిర్ కటింగ్‌షాపులు, హోటళ్లు ఈనెల 15 వరకు మూసివేయాలని సర్పంచ్ సూచించారు.
కిరాణ, ఇతర దుకాణాలు ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ నిర్ణీత దూరం పాటిస్తూ విధిగా మాస్క్ ధరించాలని, లేనిపక్షంలో రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆ గ్రామంలో ఒక్కరోజులోనే 27 కరోనా కేసులు (Covid Cases) వెలుగుచూశాయి.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైరస్ రెండో దశ తీవ్రత పెరుగుతోంది. 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉంది. జగిత్యాల జిల్లాలో వారంలో పాజిటివ్ ఐదు రెట్లు, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్‌లో నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు పెరిగాయి. కాగా, రాష్ట్రంలోని 25 జిల్లాల్లో వారం క్రితం వరకు పాజిటివ్‌లు పదిలోపే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సగటున 40-50 కేసులు నమోదవుతున్నాయి.
మార్చి 28న రాష్ట్రంలో 403 మందికి వైరస్ నిర్ధారణ అయింది. శనివారం ఆ సంఖ్య 1,321కి పెరిగింది. హైదరాబాద్‌లో 320, మిగిలిన అన్ని జిల్లాల్లో 1,001 పాజిటివ్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తుండటంతో అన్ని జిల్లాల్లో కలిపి 88 కొవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది. వీటిలో మొత్తం 8,114 పడకలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాల్లో అత్యధికం ప్రభుత్వ విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొల్పారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ కేంద్రాలతో పాటు హోటళ్లలోనూ సొంత ఖర్చుతో ఉండేలా కేంద్రాలను అందుబాటులో ఉంచారు.
శనివారం 45 ఏళ్లు దాటిన 41,488 మందికి మొదటి డోస్ టీకా వేశారు. అలాగే వైద్య సిబ్బందిలో 1,035 మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,009 మంది మొదటి డోస్ వేసుకున్నారు. అలాగే తాజాగా ఒక్క రోజులో రెండో డోస్ తీసుకున్నవారు 10,872 మంది ఉన్నారు. మొత్తం మొదటి, రెండో డోస్ టీకాలు వేసుకున్నవారి సంఖ్య 14,38,828 చేరిందని శ్రీనివాసరావు తెలిపారు.