
Hyderabad, April 5: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హెయిర్ కటింగ్ షాపులు, లాండ్రీలు, ధోబీఘాట్ల యజమానులకు (dhobi ghat laundry shops and saloon shop owners) సీఎం కేసీఆర్ శుభవార్తను అందించారు. రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు (TS Free Power) అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (Telangaan cm kcr) అధికారులను ఆదేశించారు. వారికి నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఆదివారం జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నది.
అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయినుంచి జీహెచ్‌ఎంసీ వరకు ఉన్న కటింగు షాపులు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు. కులవృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సాంకేతికాభివృద్ధి కారణంగా రజకులు, నాయీబ్రాహ్మణులు కులవృత్తి నిర్వహణలో పలురకాల యంత్రాలు వాడుతున్నారు. ఇకనుంచి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తుండటంతో వీరికి శారీరక శ్రమ తగ్గి, ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామస్థాయి నుంచి జీహెచ్‌ఎంసీ వరకు కులవృత్తిలో ఉన్న నాలుగున్నర లక్షలమంది రజకులకు, రెండున్నర లక్షలమంది నాయీబ్రాహ్మణులకు ప్రయోజనం కలుగనుంది.
ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు అంచనావేశారు. ఈ నెల నుంచి రాష్ట్రంలో నెలకు 250 యూనిట్లవరకు విద్యుత్తు వాడే క్షవరశాలలు, లాండ్రీలు, దోబీఘాట్ల యజమానులు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై రజకులు, నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.