Telangana Cabinet Decisions: రాష్ట్ర ఆదాయం పడిపోయింది, కఠినమైన ఆర్థిక నియంత్రణ పాఠించాలి, మహిళ భద్రత కోసం చట్టాల మార్పులకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు, తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యాంశాలు

ఈ పరిస్థితుల్లో అన్ని శాఖలు కఠినమైన ఆర్థిక నియంత్రణ పాటించాలని సిఎం చెప్పారు.....

File image of Telangana CM KCR | File Photo

Hyderabad, December 12:  బుధవారం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్ (CM KCR) అదే రోజు సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణమై ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశం (Cabinet Meet) నిర్వహించారు. 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మహిళల భద్రతపై ప్రధానంగా చర్చించారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలు (Tax Returns) మరియు ఇతర ఆర్థిక విషయాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. ఈ సందర్భంగా మంత్రులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్, జిఎస్టీ నష్ట పరిహారం తదిరత నిధులు రావడం లేదని చెప్పారు. ఆర్థిక మాంద్యం (Economic Crisis) కారణంగా రాష్ట్రంలో కూడా ఆదాయాలు పడిపోయాయని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అన్ని శాఖలు కఠినమైన ఆర్థిక నియంత్రణ పాటించాలని సిఎం చెప్పారు. బడ్జెట్ కేటాయింపులకు మించి ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయడానికి వీల్లేదని సిఎం స్పష్టం చేశారు. అన్ని శాఖలు విధిగా నియంత్రణ పాటించాల్సిందేనని, సరైన ఆర్థిక క్రమశిక్షణతోనే పరిస్థితిని ఎదుర్కోగలమని అన్నారు. అదనపు ఆదాయం (Additional Revenue) రాబట్టే అవకాశాలపై మంత్రివర్గంలో చర్చించారు. నిధుల వినియోగంలో ఇప్పుడున్న లోటుపాట్లను సవరించుకునే విషయంపై కూడా చర్చించారు. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు తమ శాఖకు సంబంధించిన నిధుల వినియోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, నిధుల వినియోగంలో నియంత్రణ పాటించాలని సిఎం చెప్పారు.

ఇక దిశ ఉదంతం నేపథ్యంలో కేబినేట్ భేటీలో తీవ్రంగా చర్చించారు. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చర్యలు కఠినంగా ఉండాలని సీఎం అన్నారు. అందుకనుగుణంగా చట్టాల్లో మార్పు అనివార్యమని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళ భద్రత (Women Safety) కోసం  తక్షణ న్యాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చట్టాల్లో సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలనే అభిప్రాయం వ్యక్తం అయింది.

 

ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణం, కేటాయింపులు

 

ఇక ఇటీవల చర్చించిన నూతన ప్రాజెక్టుల నిర్మాణాలపై కూడా ఈ భేటీలో చర్చించారు. 320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రూ.3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుమ్ముగూడెం వద్ద ఏడాదికి ఐదారు నెలల పాటు పుష్కలంగా నీటి లభ్యత ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. 37 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజి నిర్మాణం చేపట్టవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.

కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు వరకు 3 టిఎంసిల నీటిని తరలించడానికి నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టు రోజుకు 2 టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి వీలుగా ఉన్నది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉన్నందున రోజుకు 3 టిఎంసిలను ఎత్తిపోసుకోవచ్చని అధికారులు ప్రతిపాదించారు. మిడ్ మానేరు వరకు 3వ టిఎంసిని ఎత్తిపోసే పనులను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.11,806 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఖర్చులను రెండేళ్ల బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయించారు.

గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత వెల్లివిరిసేలా, ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం- పల్లె ప్రగతి పురోగతిపై సమావేశంలో చర్చించారు. ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చిన ఈ కార్యక్రమం స్పూర్తిని కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని పంచాయతి రాజ్ కార్యదర్శిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎలాంటి అలసత్వం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. గతంలో 30 రోజుల కార్యక్రమం నిర్వహించనట్లుగానే వచ్చే నెలలో పది రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.



సంబంధిత వార్తలు