MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం చేసిన ధర్మాసనం
న్యాయవాది విన్నపాన్ని తిరస్కరించింది.స్టే కానీ, స్టేటస్ కో (యథాతథ స్థితి) కానీ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.ఆ సమయంలోనే అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పింది.
Hyd, Feb 8: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనంలో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఇక BRS ఎమ్మెల్యేలకు ఎర కేసు(MLAs Poaching Case)లో తెలంగాణ హైకోర్టు (TS High Court) ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది.
ఈ రోజు విచారణలో హైకోర్టు ఉత్తర్వులపై ‘స్టే’ విధించాలని.. లేదా ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు.ఫైల్ ఒకసారి సీబీఐ చేతికి వెళ్తే పిటిషన్ నీరుగారిపోతుందని సీజేఐకు తెలిపారు. ఫైల్స్ ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ (CBI) నుంచి ఒత్తిడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
దీనికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. న్యాయవాది విన్నపాన్ని తిరస్కరించింది.స్టే కానీ, స్టేటస్ కో (యథాతథ స్థితి) కానీ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.ఆ సమయంలోనే అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. కేసులో ఏమైనా మెరిట్స్ ఉంటే డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 13న విచారించాలని సిద్ధార్థ లుత్రా కోరాగా.. అందుకు ధర్మాసనం సమ్మతించలేదు.
మరోవైపు హైకోర్టులోనూ దీనిపై (MLAs Poaching Case) విచారణ జరిగింది. తీర్పు ఆపాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నిరాకరించారు. కేసు దస్త్రాల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని.. సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ కోరారు. కేసు ఫైల్స్ ఇవ్వాలని సీఎస్‌కు మంగళవారం సీబీఐ మరోసారి లేఖ రాసిందని చెప్పారు. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపకూడదని.. సుప్రీంకోర్టు మాత్రమే దీనిపై సమీక్ష చేస్తుందని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు.