CM KCR: మహాత్ముడే బాటే మాకు స్పూర్తి! మహాత్మ గాంధీ ప్రేరణగా పల్లె, పట్టణ ప్రగతి చేపట్టాం, ఆయన బాటను ఆచరించి తెలంగాణ సాధించామన్న సీఎం కేసీఆర్, గాంధీ ఆస్పత్రిలో మహాత్ముడి భారీ విగ్రహం ఆవిష్కరణ

వెయ్యి సంవత్సరాల్లో ఇంతటి మహాత్ముడు మరొకరు పుట్టలేదని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ రకంగా అనేకమైన పద్ధతులు, అహింస సిద్ధాంతాలు గొప్ప విషయాలను ప్రబోధించిన మహాత్ముడు మనకు సదా స్మరణీయుడు

Credit @ TRS Party Twitter

Hyderabad, OCT 02: పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ మహాత్మా గాంధీయే (Mahatma Gandhi) అని సీఎం కేసీఆర్‌ (CM KCR) తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘అనేక మతాలు, జాతులు, భిన్నమైన సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార్యాలు ఉంటే భారతావతిలో.. ప్రతి భారతీయుడిలో స్వతంత్య్ర కాంక్ష, స్వతంత్య్ర స్వేచ్ఛను రగిలించి యావత్‌ భారతాన్ని కుల, మత, వర్గ రహితంగా స్వాతంత్య్ర సమరం వైపు నడిపించిన సేనాని మహాత్మా గాంధీ (Gandhi). జాతి స్వాతంత్య్రమే కోసం మనం ముందుకు పురోగమించాలని చెప్పి అనేక సంస్కృతుల సమ్మేళనంగా స్వాతంత్య్ర సంగ్రామాన్ని సాగించినటువంటి మహనీయుడు గాంధీ. ఆయన చేసినా ఒక సందేశం. చరకా చేతపట్టినా, నూలువడికినా, చీపురుపట్టి మురికివాడలు శుభ్రం చేసినా, ఉపవాస దీక్ష చేసినా, ఉప్పు సత్యాగ్రహం చేసినా ఒక అద్భుతం.. సందేశమే. గాంధీ ప్రతిమాట, ప్రతీ అడుగూ, ప్రతి ఆచరణాత్మకంగా ఉండేది. ధనికులైనా, సుఖంగా జీవించగలిగినప్పటికీ.. మహాత్మాగాంధీ సైతం న్యాయవాద వృత్తిని, ఆస్తిని, కుటుంబాన్ని త్యాగం చేసి.. జైలుపాలవుతూ చేస్తున్న స్వాతంత్య్ర పోరాటాన్ని చూసి, స్ఫూర్తి పొంది జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌పటేల్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఇలా ఎందరో మహనీయులు స్వతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. బ్రహ్మాండంగా ఆ పోరాటం ద్వారా స్వతంత్రం సాధించారు. వారందించిన స్వేచ్ఛా వాయువులే.. ఈ రోజు మనం అనుభవించే 75 సంవత్సరాల భారత స్వతంత్రం’ అన్నారు.

‘దేశమంతా ఒకరకంగా జరుగుతుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మహాత్మ గాంధీ గారిని 15 రోజుల పాటు గొప్పగా స్మరించుకున్నాం. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సమయంలో చాలా గొప్పగా మహాత్మాగాంధీ జీవితాన్ని గొప్పగా చిత్రీకరించిన ‘గాంధీ’ చిత్రాన్ని రాష్ట్రంలో ప్రదర్శన చేసుకున్నాం. దాదాపు 25లక్షల మంది విద్యార్థులు 5వేల షోల ద్వారా గాంధీజీ స్వతంత్ర పోరాటాన్ని, వారి జీవితాన్ని ఆలకించి.. చూసి ఆనందించి.. ఆదర్శంగా స్వీకరించే అవకాశాన్ని రాష్ట్రంలో కల్పించుకోగలిగాం. చాలా గొప్ప వ్యక్తలు.. మార్టిన్‌ లూథర్‌ లాంటి వారు.. జీసస్‌ నాకు సందేశం ఇస్తే.. గాంధీజీ ఆచరణలో చూపించారు.. నేను ఆ మార్గాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు. మానవతా సారాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న గాంధీజీ నాకు ఆదర్శనీయుడు అని దలైలామా చెప్పారు.

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ నుంచి మొదలు నెల్సన్‌ మండేలా వరకు నల్లజాతి దాస్యశృంఖలాలు తెంచడానికి ప్రేరణ ఇచ్చిన.. సూక్తి ముక్తావళి అంతా మహాత్ముడు తన ఆచారణాత్మంగా అందించినటువంటి సిద్ధాంతమే అనేక పోరాటాలకు దారి తీసింది. నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌కు వచ్చారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ.. గాంధీ అనే వ్యక్తి ఈ భూగోళం మీద పుట్టి ఉండకపోతే బరాక్‌ ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదు అని చెప్పారు.. ఒబామా స్వయంగా చెబితే వినే అదృశ్యం నాకు కలిగింది’ అన్నారు.

 

‘మహాత్ముడిని యూఎన్‌ఓ మిలీనియం ఆఫ్‌ ది పర్సన్‌గా ప్రకటించింది. వెయ్యి సంవత్సరాల్లో ఇంతటి మహాత్ముడు మరొకరు పుట్టలేదని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ రకంగా అనేకమైన పద్ధతులు, అహింస సిద్ధాంతాలు గొప్ప విషయాలను ప్రబోధించిన మహాత్ముడు మనకు సదా స్మరణీయుడు. ఆయన జయంతి సందర్భంగా అద్భుతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్‌ యాదవ్‌, ఆయన బృందం అభినందనీయులు. వారి కీర్తి శాశ్వతంగా ఉంటుంది. 150 సంవత్సరాల కిందట జన్మించిన గాంధీజీ ఆచరణాత్మకమైన, శాంతి, సౌభ్రాతృత్వానికి, సహనానికి మారుపేరైనా అహింసా సిద్ధాంతాన్ని మనకు అందించారు. ఆ బాటలో మన దేశం నిలబడి ఉంది.

 

ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉంది. ఎనాడు తెలంగాణ ఏర్పాటు కోసం నేను బయలుదేరిన నాడు.. నన్ను కూడా ఎగతాళి చేసేవారు. ఈ బక్కపలుచటోడు ఏం చేస్తడు.. వీడితోని ఏమైతదని ఘోరంగా అవహేళన చేసినవారున్నారు. నేను దూషణలు వినవలసి వచ్చినప్పుడు ఒకసారి కండ్లు మూసికొని మహాత్మా గాంధీనే తలచుకునేవాడిని. ఆయన చూపిన ఆచరణలోనే ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం. మహాత్ముడు చెప్పిన పారిశుధ్యం కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీసుకొని ముందుకెళ్తూ అవార్డులు అందుకుంటున్నాం’ అన్నారు సీఎం కేసీఆర్‌.