Rythu Bandhu: వానాకాలానికి 'రైతుబంధు' వచ్చేనా? లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో రాష్ట్ర ఆదాయానికి గండి, రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంపై కమ్ముకున్న నీలిమేఘాలు
రెండో దశ లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది.....
Hyderabad, May 28: తెలంగాణలో జూన్ నుండి ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు రైతుబంధు పథకం కింద రైతులకు అందించాల్సిన పంట పెట్టుబడి సాయం ఈసారి నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. రెండో దశ లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షలకు పైగానే ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమౌతాయి. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రస్తుత సీజన్‌లో రైతు బంధు అమలుపై నెమ్మదిగా వెళ్లాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మే నెలలో 20 రోజులు లాక్‌డౌన్ అమలుతో జూన్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. మే 12న విధించిన లాక్‌డౌన్ -2 మే 30 వరకు అమల్లో ఉండనుంది, మే 30 దాటిన తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగింపు అవకాశాలు ఉన్నాయి.
ఒక సీజన్ కోసం రైతులందరికీ రైతు బంధు ప్రయోజనాలను పంపిణీ చేయడానికి రూ. 7,500 కోట్లు అవసరమయ్యాయి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి, ఆర్బిఐ నుండి బాండ్ల ద్వారా రూ. 8 వేల కోట్ల నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ నిధులు వచ్చే మూడు నెలల్లో ప్రధానంగా ఉద్యోగుల జీతాలు మరియు ఆసారా పెన్షన్ల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ దేశ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చినందున రాష్ట్ర అవసరాల కోసం ఇతర ఆర్థిక వనరుల నుండి అదనపు నిధులను సమీకరించడం చాలా కష్టమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో రైతుబంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందని భావించినా, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించే పథకం 'రైతుబంధు' కోసం మరి కాస్త ఆలస్యంగానైనా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారా? మే 30న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర కేబినేట్ భేటీలో రైతుబంధు అమలు విషయంలో ఏదైనా చర్చిస్తారా? లేదా ? అన్నది చూడాలి.