Telangana: నేటి నుంచి జూలై 4 వరకు హైదరాబాద్‌లో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఎస్‌ఎన్‌డీపీ వినతి మేరకు ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రూట్ మ్యాప్ ఓ సారి చెక్ చేసుకోండి

ఎస్‌ఎన్‌డీపీ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad Traffic Restrictions (Photo-City Police Page)

Hyd, April 21: భాగ్యనగరంలో జీహెచ్‌ఎంసీ స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ)–2 కింద బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్‌ నాలాపై జరిగే బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు (Hyderabad Traffic Restrictions) విధించారు. ఎస్‌ఎన్‌డీపీ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్‌ రోడ్డు, సికింద్రాబాద్‌ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్‌ ఆంక్షలను (Traffic advisory at Begumpet) గమనించి ఆ మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జూన్‌ 4 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్‌ నుంచి రసూల్‌పురా జంక్షన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్‌ దేవాలయం వద్ద లేన్‌ (యాత్రి నివాస్‌ దగ్గర) వద్ద ఎడమ వైపు మళ్లీ..పీజీ రోడ్డు, ఫుడ్‌ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్‌ కుడి వైపు, మినిస్టర్‌ రోడ్డు మీదుగా రసూల్‌ పురా ‘టి’ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కిమ్స్‌ ఆస్పత్రి నుంచి రసూల్‌పురా ‘టి’ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలు న్యూ రాంగోపాల్‌పేట పీఎస్‌ ఎదురుగా సింథికాలనీ, పీజీ రోడ్డు వైపు రైట్‌ టర్న్‌ తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు.

హైదరాబాద్‌ శివారు ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్, 111 జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు, ఆంక్షలు ఎత్తివేస్తూ కొత్త జీవో జారీ, 84 గ్రామాల్లో వెల్లివిరిసిన ఆనందం

బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి వచ్చే కిమ్స్‌ హాస్పిటల్‌ వైపు వెళ్లే వాహనదారులు రసూల్‌పురా ‘టి’ జంక్షన్‌ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఇక హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్, రసూల్‌పురా ‘టి’ జంక్షన్‌ మధ్య ‘వన్‌ వే’గా గుర్తించారు. సికింద్రాబాద్‌ నుంచి సోమాజీగూడ వైపు గూడ్స్‌ వాహనాలతో పాటు ప్రైవేటు, స్కూల్స్, కాలేజీ బస్సులు వంటి రవాణా వాహనాలను అనుమతించరు. అవి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.

కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లే మార్గాలు ఇవీ.. పంజగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌..

గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్‌ కింద యూటర్న్‌ తీసుకుని, హనుమాన్‌ టెంపుల్‌ లేన్, ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్‌ ఎడమ మలుపు నుంచి కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లాలి.

పంజగుట్ట ఎక్స్‌రోడ్డు, ఖైరతాబాద్‌ జంక్షన్, ఖైరతాబాద్‌ ఫ్లైవర్, నెక్లెస్‌ రోటరీ, పీవీఎన్‌ఆర్‌ మార్గ్, నల్లగుట్ట, ఆర్‌యూబీ, మినిస్టర్‌ రోడ్డు, కిమ్స్‌ హాస్పిటల్‌.

సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌..

సీటీఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్‌ జంక్షన్‌ కుడి వైపు తిరిగి, మినిస్టర్‌ రోడ్డు మీదుగా కిమ్స్‌ హాస్పిటల్‌ చేరుకోవాల్సి ఉంటుంది.

కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్‌ విగ్రహం, ట్యాంక్‌బండ్, రాణిగంజ్‌ జంక్షన్‌ ఎడమ మలుపు, మినిస్టర్‌ రోడ్డు, కిమ్స్‌ హాస్పిటల్‌ లేదా బుద్ధభవన్, నల్లగుట్ట, ఆర్‌యూబీ, మినిస్టర్‌ రోడ్డు, కిమ్స్‌ హాస్పిటల్‌ చేరుకోవాల్సి ఉంటుంది.