Telangana: మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య, ఒకరు ఆన్ లైన్ మోసానికి మరొకరు వేధింపులకు బలి

వీరిలో ఒకరు ఆన్‌లైన్ మోసానికి బలికాగా, మరో కానిస్టేబుల్ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు.

Death ( Representative image -ANI)

Hyd, Dec 30: తెలంగాణలో ఓ విషాదకర ఘటనలో మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ఆన్‌లైన్ మోసానికి బలికాగా, మరో కానిస్టేబుల్ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకెళితే.. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34) సిద్దిపేటలో ఉంటూ సిరిసిల్ల 17వ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

‘ఫినిక్స్’ అనే ఆన్‌లైన్ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మి అప్పు చేసి మరీ రూ. 25 లక్షలు అందులో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలకృష్ణ అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అందుకోసం భార్య మానసను ఒప్పించాడు. అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ చావులకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి టీలో ఎలుకల మందు కలిపి తాగారు.

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. మృతుడు మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నట్టు గుర్తింపు (వీడియో)

ఎలుకల మందు ప్రభావం చూపకపోవడంతో బాలకృష్ణ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మానస ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే వారొచ్చి బాలకృష్ణ, మానస, కుమారులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలకృష్ణను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మరింత మెరుగైన వైద్యం కోసం చిన్నారులను హైదరాబాద్ తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నివసించే సాయికుమార్ (50) కొల్చారం పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నిన్న తెల్లవారుజామున విధుల్లో ఉన్న ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సాపూర్‌లో ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలితో సాయికుమార్‌కు పరిచయం ఏర్పడింది. దీనిని అవకాశంగా మార్చుకున్న ఆమె భర్త, అల్లుడు డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెందిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన భార్య శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.