Telangana's COVID Report: తెలంగాణలో లక్ష దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో భారీగా 2474 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 744కు పెరిగిన కరోనా మరణాలు
అయినా ప్రజల్లో ఏమాత్రం భయం లేదు, ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు. భౌతిక దూరం పాటించడం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా జరుపుతున్నారు....
Hyderabad, August 22: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తోంది. అయినా ప్రజల్లో ఏమాత్రం భయం లేదు, ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు. భౌతిక దూరం పాటించడం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా జరుపుతున్నారు, కేసుల సంఖ్య తక్కువగా చూపుతున్నారు అనే విమర్శలు ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఇప్పటివరకు నిర్ధారించబడిన కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో నేడు లక్ష దాటింది.
తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 43,095 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,474మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1,239 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,91,173 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,01,865కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 447 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 149, రంగారెడ్డి జిల్లా నుంచి 201, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 72 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొవిడ్ విజృంభన కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే కొన్ని జిల్లాల్లో 100కు పైగా కేసులు నివేదించబడ్డాయి. నిజామాబాద్ నుంచి 153, ఖమ్మం నుంచి 125, వరంగల్ అర్బన్ నుంచి 123, నల్గొండ నుంచి 122 కేసులు నిర్ధారించబడగా, సిద్ధిపేట మరియు జగిత్యాల జిల్లాల నుంచి వరుసగా 92, 91 కేసుల చొప్పున నివేదించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:
ఆగష్టు 21న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 7 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 744 కు పెరిగింది.
అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో 1768 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 78,735 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,386 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.