Munugode By- Election: రేపటి నుంచే మునుగోడులో ప్రచారం మొదలు పెడతాం, అసమ్మతి నేతలను బుజ్జగించిన టీపీసీపీ నేతలు, ఒక్కో మండలానికి ఇద్దరు ఇంచార్జ్‌లు, ఒకే వేదికపైకి పాల్వాయి స్రవంతి, చెలిమెల కృష్ణారెడ్డి
రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) వ్యాపార అవసరాల కోసమే పార్టీ మారారని ఆయన చెప్పారు. మునుగోడులో అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో బీజపీ, టీఆర్ఎస్ ఉన్నాయని చెప్పారు.
Hyderabad, SEP 10: మునుగోడు ఉప ఎన్నిక (Munugode Byelection) ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో (Revanth reddy) పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, దామోదర్ రెడ్డి, అంజన్ కుమార్, ఏఐసీసీ సెక్రటరీ బోసురాజు పాల్గొన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను రేవంత్ రెడ్డి, బోసురాజు బుజ్జగించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రేపటి నుంచి మునుగోడు ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు (telangana congress) వెళ్తారని చెప్పారు. కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
సెప్టెంబరు 18 నుంచి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతల ప్రచారం ఉంటుందని చెప్పారు. మోదీ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగం ఉండేది కాదని అన్నారు. అంతేగాక, ఇప్పుడు దేశంలో మోదీ ప్రభుత్వం ఉప్పు, పప్పు చివరకు పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ వేస్తోందని చెప్పారు.
రేపటి నుంచి మునుగోడులో ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి మండలానికి ఇద్దరు ఇన్ చార్జులను నియమించామని అన్నారు. రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) వ్యాపార అవసరాల కోసమే పార్టీ మారారని ఆయన చెప్పారు. మునుగోడులో అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో బీజపీ, టీఆర్ఎస్ ఉన్నాయని చెప్పారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఈ ఉప ఎన్నిక బరిలోకి దింపుతోంది.