TS Constable Recruitment: 15,640 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, కానిస్టేబుల్ నియామక పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
15,640 పోస్టుల భర్తీకి నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ (High Court) గురువారం ఆదేశించింది, అయితే అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది
Hyd, Jan 4: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. 15,640 పోస్టుల భర్తీకి నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ (High Court) గురువారం ఆదేశించింది, అయితే అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయం తీసుకొని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, అభ్యంతరాలు ఉన్న నాలుగుప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని పోలీసు నియామక మండలి (TSLPRB)ని ఆదేశించింది.
తెలంగాణలో సివిల్, ఏఆర్ తదితర 16,604 పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ (TS Police Constable Recruitment) బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసి.. అర్హత పరీక్షలు నిర్వహించింది. ఇందులో 15,640 మంది అభ్యర్థులను ఎంపికయ్యారు. 2023 ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను నిర్వహించిన పోలీస్ నియామక బోర్డు.. పరీక్షా ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేసింది.
అయితే నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసు నియామక మండలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.దీంతో నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది.
అయితే, రాత పరీక్షలు నాలుగు ప్రశ్నలు వచ్చాయని పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం నియామకాలపై స్టే విధించింది. నాలుగు మార్కులు కలపాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన బెంచ్.. ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.