CM vs TSRTC JAC: సీఎం కేసీఆర్‌తో ఢీకొడుతున్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, అవసరమైతే తెలంగాణ బంద్, సమ్మె పట్ల ప్రజల్లో మిక్స్‌డ్ టాక్, ముందుంది ముసళ్ల పండగ
ఇందులో ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో చూడాలిక.
Hyderabad, October 09: దసరా పండగ ముగిసింది, ఇక ఆర్టీసీ స్ట్రైక్ (TSRTC Strike)తో తెలంగాణలో ముందుంది ముసళ్ల పండగ. అటు ప్రభుత్వం (CM KCR), ఇటు టీఎస్ ఆర్టీసీ ఎవ్వరూ తగ్గకపోవడంతో తెలంగాణలో ఐదవ రోజూ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. తమ భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ ఐకాస (TSRTC JAC) సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం భేటీ అయ్యింది. తమకు మద్ధతు తెలపాలని కోరుతూ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలను మరియు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఐకాస నేతలు ఆహ్వానించారు. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న ఆర్టీసీని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ "జీతాల కోసం కాదని, జీవితాల కోసం" తాము సమ్మె చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ రక్షించుకోవడమే తమ లక్ష్యం అని అన్నారు. ఇప్పటివరకూ 7 వేల మందికి పైగా కార్మికులు రిటైర్ అయినా గత ఐదేళ్లలో ఒక్క నియామకం జరగలేదని అశ్వద్ధామ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఆర్టీసీ ఐకాస తాజా భేటీ ప్రకారం సమ్మెను మరింత ఉదృతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో మిగతా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నింటిని ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్‌పై ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వం సమ్మెలను అణిచివేయలేదు, గతంలో ఈ సమ్మెలు, ఉద్యమాలతోనే సీఎం అయిన కేసీఆర్ మాత్రం తమ సమ్మెను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతగా అణిచివేస్తే అంతగా పైకి లేస్తామని హెచ్చరిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో లేదని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రికి ఆర్టీసీ కార్మికులు సవాల్ విసురుతున్నారు. అక్టోబర్ 10న ఆర్టీసీ సమ్మెపై మరోసారి హైకోర్టులో విచారణ
ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో తాజా పరిస్థితి ఇలా ఉంది
సమ్మె నేపథ్యంలో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు, ఇన్నాళ్లు దసరా సెలవులు ఉండటంతో జనం ఇంటికే పరిమితమయ్యారు. ఇక సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణం ఎలా అని ఆందోళన వ్యక్తం అవుతుంది. త్వరలోనే విద్యాసంస్థలు, కార్యాలయాలు ప్రారంభమవుతాయి. అప్పుడు పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం ఏం జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెబుతున్నారు.
ఈ సమ్మె పట్ల ప్రజల్లో మిక్స్‌డ్ టాక్ ఉంది. కొంతమంది పండగల సీజన్‌లో ఇలాంటి సమ్మెలు కరెక్ట్ కాదు, ఈ సమ్మెల వల్ల మధ్యలో నలిగిపోయేది ప్రజలే అని అంటున్నారు. బస్సుల్లో ప్రయాణించేటపుడు అప్పుడప్పుడు కొంతమంది ఆర్టీసీ కార్మికులు ప్రయాణికులతో ప్రవర్తించే తీరు కారణంగా జనాల్లో వారి పట్ల కొంత ఇన్-బిల్ట్ వ్యతిరేకత ఉంది. అయితే మరికొంత మంది మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, వెంటనే సమ్మెను విరమింపజేయాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. ఇక రోజూవారీ కింద డ్రైవర్లకు రూ. 1500, కండక్టర్లకు రూ. 100 చొప్పున ఆర్టీసీలో తాత్కాలికంగా నియామకాలు చేస్తున్నట్లు తెలియడంతో చాలా మంది నిరుద్యోగులు తమను తీసుకోవాల్సిందిగా బస్ డిపోల దగ్గర బారులు తీరుతున్నారు. తెలంగాణలో కొత్త ఆర్టీసీ పాలసీ..
ఏదేమైనా సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాదులో సిటీ బస్సులు తిరగకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో సెలవులు ముగుస్తుండటంతో ఈ ఇబ్బందులు తీవ్రతరం కానున్నాయి. తాత్కాలికంగా ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడుస్తున్నా, పల్లె వెలుగు లాంటి బస్సుల్లోకూడా డీలక్స్ చార్జీలు వసూలు చేస్తున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు. వీరిని చూసి ప్రైవేట్ క్యాబ్స్ , ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు వారిష్టమున్నట్లుగా పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఒకరితోఒకరు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ మరియు టీఎస్ ఆర్టీసీ జేఏసీతో సమస్యకు పరిష్కారం ఇప్పటివరకు లభించలేదు. ఇందులో ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో చూడాలిక.